Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |
Showing posts with label Linux. Show all posts
Showing posts with label Linux. Show all posts

హార్డ్ డిస్క్ పై నాలుగో భాగం - పార్టిషన్లతో పని చేయడం

19 November 2009


మొదటి మూడు భాగాలలో, హార్డ్ డిస్క్ గురించిన ముఖ్యమైన ప్రాధమిక సమాచారం తెలుసుకున్నాం. ఫైల్ సిస్టం లు అంటే ఇప్పుడు మనకో మంచి అవగాహన ఉంది. ఈ పాఠ్యాంశంలో కాస్త తనువూ, మనసూ శ్రద్ధతో నిమగ్నం చేసి (అంటే మన వాడుకలో, ఒళ్ళు దగ్గరపెట్టుకుని :) ) చేయాల్సిన విషయాలు చూద్దాం - అవే, పార్టిషన్లు సృష్టించడం, సైజు మార్చడం, తొలగించడం.

ముందుగా మీరు ఒక విషయం తప్పకుండ గమనించాలి! మీరు ఏ చిన్న తప్పు చేసినా మీ హార్డ్ డిస్క్ మీదున్న డేటా కి చాలా పెద్ద ప్రమాదమే వస్తుంది! కాబట్టి, మీకు ముఖ్యమైన ఫైళ్లు గట్టా ఉంటే ముందు అవి వేరే కంప్యూటర్ కో ఒక సిడి లోకో కాపీ చేస్కొండి.

హార్డ్ డిస్క్ పై మూడో భాగం - ఫైల్ సిస్టంలు


మొదటి రెండు భాగాలలో హార్డ్ డిస్క్ గురించిన ప్రాధమిక అవగావానకి కావాల్సినవి చూశాం. హార్డ్ డిస్క్ తనువైతే, ఫైల్ సిస్టం ఆత్మ. అదెలాగో, ఫైల్ సిస్టం ఏంటో చూద్దాం.

హార్డ్‌డిస్క్ గురించి తెలుసుకుందాం - రెండవ భాగం

మొదటి భాగంలో, అసలు హార్డ్ డిస్క్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, పార్టిషన్ అంటే ఏంటి, వాటి వివరాలు ఎలా చూడాలి అన్న అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు, పార్టిషన్లు  ఎందుకు, ఎన్ని పెట్టుకోవాలి, మీకు తెలియకుండా జాగా మొత్తం కబ్జా అయిపోతే ఏం చేయాలి లాంటి వివరాలు తెలుసుకుందాం.

హార్డ్‌డిస్క్ గురించి తెలుసుకుందాం - మొదటి భాగం



ఈ పాఠ్యాంశంలో మనం హార్డ్ డిస్క్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, పార్టిషన్ అంటే ఏంటి, వాటి వివరాలు ఎలా చూడాలి అన్న అంశాలు నేర్చుకుందాం. మీకు లినక్స్ఇన్‌స్టాల్ చేసిన కంప్యూటర్ ఉంటే, ఇందులో చెప్పేవి మీరు కూడా ప్రయత్న పూర్వకంగా చేసినట్టు ఉంటుంది. విండోస్ వాడేవాళ్ళు, ఏమి చేయనక్కర్లేదు, చూస్తే సరిపోతుంది :) కాకపోతే చేసే త్రిల్ ఉండదు :) మీకు టెర్మినల్ గురించి అస్సలు తెలియకపోతే కనుక, తెలుగుస్తానం లో ఉన్న "షెల్ గూర్చి నేర్చుకుందాం" అనే ట్యూటోరియల్ చదివితే ఒక అవగాహన వస్తుంది.





ఇక విషయం లోకి వస్తే,
కంప్యూటర్ కొన్నప్పడు, కొత్త ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేస్కునేటప్పుడు ఇలా చాలా సమయాల్లో హార్డ్‌డిస్క్ గురించి, దానికి సంబందించిన పనుల గురించి వింటూ ఉంటాం. ఈ పాఠ్యాంశంలో హార్డ్‌డిస్క్ కంప్యూటర్ లో ఎలా ఉపయోగపడుతుందో, మనం తీస్కోవాల్సిన జాగ్రత్తాలేంటో చూద్దాం. మీరు లినక్స్ లోను, విండోస్ లోను, స్టార్ట్ మెనూ లో ఉన్న ప్లేసెస్ లో "కంప్యూటర్" మీద క్లిక్ చేస్తే ఒక విండో తెరుచుకుంటుంది. ఇలాగ..




అందులో మన సిస్టమ్ లో ఉన్న పార్టిషన్ లన్నీ చూపిస్తుంది. ఇప్పుడు వాటి వెనకున్న విషయాలు ఎంటో తెలుసుకుందాం.

కంప్యూటర్ లో శాశ్వతంగా నిక్షిప్త పరచాల్సిన సమాచారాన్ని దాచడానికి ఉపయోగపడే సాధనం హార్డ్‌డిస్క్. అంటే పవర్ సప్లై లేకపోయినా, మీరు పొందుపరిచిన సమాచారం అలాగే ఉండేలా చూసే ఒక ఆధారం. దాన్ని ఉపయోగించే విధానం లో, జాగ్రత్తగా గమనిస్తే, దానికి ఇల్లుకి చాలా దగ్గర పోలిక ఉంటుంది. మనం ఒక గది నిర్మాణానికి కావాల్సిన జాగాని మీటర్లలోనో, అడుగులలోనో కొలుస్తాం. అలాగే, హర్డ్‌డిస్క్ లో జాగాని, బైట్స్ లో కొలుస్తారు. 1000 బైట్ లు ఐతే 1 కిలోబైట్ అని, 1000 కిలోబైట్లు ఐతే ఆది ఒక మెగబైట్ అని, 1000 మెగబైట్లు ఐతే ఆది 1 గిగాబైట్ అని అంటాం, అంటే 1 జి.బి  అన్నమాట. ఒక గది కట్టాలి అంటే దానికి కొంత ఖాళి స్థలం ఎలా అవసరమో, ఒక కొత్త పార్టిషన్‌ కావాలి అనుకుంటే హార్డ్‌డిస్క్ లో కొంత ఖాళీ జాగా కూడా అలాగే అవసరం.

గది కట్టిన తర్వాత గోడలు, మెట్లు లాంటివి కొంత బాగం ఆక్రమించుకున్నట్టే, హార్డ్‌డిస్క్‌ లో ఆ పార్టిషన్‌ నిర్మాణ సమాచారం  కూడా హార్డ్‌డిస్క్‌లో కొంత జాగా ఆక్రమిస్తుంది.(ఇది బయటకి మనకు కనబడదు, జాగా కూడా చాలా తక్కువే అనుకోండి, కానీ ఆ పార్టిషన్ ఆపరేటింగ్ సిస్టం (OS) తో ఎలా అనుసందానించబడుతుందో తెలుసుకోవడానికి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవడం దోహద పడుతుంది. ఈ నిర్మాణ విధానాన్నే మనం ఫైల్ సిస్టమ్ అంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫైల్ సిస్టమ్ అంటే గది కట్టే విధానం. ఒక్కొక్క కట్టడానికి కొన్ని కొన్ని బలాలు, బలహీనతలు  ఉన్నట్టే, ఒక్కో ఫైల్ సిస్టం కి కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయి. అవి వచ్చే పాఠ్యాంశంలో చూద్దాం. పార్టిషన్ లో మనం పెట్టె ఫైళ్లు అందులో బద్రపరచబడే విధానం కూడా ఫైల్ సిస్టం ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కోసారి, కొన్ని ఫైల్ సిస్టమ్ లలో, ఫైల్స్ అమరిక చిందరవందరగా తయారవడం వల్ల హార్డ్‌డిస్క్ నుంచి వాటిని ఉపయోగిచాలంటే టైమ్ ఎక్కువ పడుతుంది, దీని వల్ల సిస్టమ్ నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ఇది విండోస్ లో ఫ్యాట్(FAT) ఫైల్ సిస్టమ్ వాడే వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు డీ-ఫ్రాగ్‌మెంట్ చేయాలి. ఈ-నాడులొ డీ-ఫ్రాగ్‌మెంటేషన్‌ పాఠ్యాంశం చదివి అదెలాగో తెలుసుకోండి. ఇక తర్వాత ఆ పార్టిషన్ ఉపయోగించేటప్పుడు, మనం దాని మీద బద్రపరిచే ప్రతి ఫైల్ కొంత బాగాన్ని ఆక్రమిస్తుంది.

ఇప్పుడు చెప్పుకున్న వాటికి సంబందించివన్నీ ఒకసారి లినుక్సు లో చూద్దాం. లినక్సులో ఇలాగే కాక, విండోస్ లో చూసినట్టే చూసే మార్గాలు కూడా ఉన్నాయి. ఐతే, ఇక్కడ నేనెంచుకున్న మార్గం టెర్మినల్‌ని మీకు దగ్గర చేసి, తర్వాత్తర్వాత మీకు ఉల్లీ, తల్లీ కలిపి చేసినా చేయని మేలు చేస్తుంది. ముందు. మన హార్డ్‌డిస్క్ సైజ్ ఎంతో, ఆది ప్రస్తుతానికి ఎన్ని పార్టిషన్లగా విభజించబడిందో చూద్దాం.  ఈ క్రింది చూపిన కమాండ్ కొడితే ఆ బొమ్మలో లాగా వస్తుంది అవుట్పుట్. విండోస్ లో ఉన్నవారు, My Computer మీద రైట్ క్లిక్ చేసి, Manage ఆప్షన్‌ ఎంచుకోండి, ఒక విండో తెరుచుకుంటుంది. అక్కడ Disk Utilities ఉంటుంది, అది ఎంచుకుంటే కనిపిస్తుంది.

sudo fdisk -l



fdisk -l కమాండ్ అవుట్పుట్

ఇప్పుడు ఒక పార్టిషన్ సైజ్, ఎంత ఉపయోగించబడింది, ఎంత జాగా మిగులుంది లాంటి వివరాలు చూద్దాం. ఈ క్రింది కమాండ్ కొట్టండి. అక్కడున్న /dev/sda2 ని మీకు పైనున్న fdisk -l అవుట్పుట్లో చూపించిన పార్టిషన్‌ల లోనుంచి ఒకదానితో మార్చి ఇవ్వాలి కమాండ్. విండోస్ వాడేవారు My Computer మీద నొక్కితే, అక్కడా ఒక్కక్క డ్రైవ్/పార్టిషన్‌ వివరాలు కనిపిస్తాయి.
sudo df -h /dev/sda2

df -h /dev/sda2 కమాండ్ అవుట్పుట్

ప్రస్తుతానికి OS ఎక్కుపెట్టిన మొత్తం పార్టిషన్‌లని చూడాలి అనుకుంటే ఉత్తినే df -h కొడితే సరిపోతుంది. అంటే, ప్రస్తుతానికి మనం వాడగలిగే పార్టిషన్ల వివరాలన్నమాట.
df -h
 

df -h అవుట్పుట్

తర్వాతి పాఠ్యాంశంలో పార్టిషన్లు  ఎందుకు, ఎన్ని పెట్టుకోవాలి, మీకు తెలియకుండా జాగా మొత్తం కబ్జా అయిపోతే ఏం చేయాలి లాంటి వివరాలు తెలుసుకుందాం. అసలు హార్డ్‌డిస్క్ ని ఇంటితో ఎందుకు పోల్చానో అందులో బాగా అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది.

జి నోమ్ షెడ్యూల్ - అలారాలు - మర్చిపోవడం మర్చిపోండి!

16 November 2009


పొద్దున్నే టైం కి లేవాలి, లేచాక శతకోటి ముఖ్యమైన పనులు చేయాలి. అందులో సవాలక్ష పనులు గుర్తుండనే ఉండవు. రోజూ ఫలానా టైం కి ఫలానా ప్రోగ్రాం రన్ చేయాలి, ఫలానా టైం కి బ్యాక్ అప్ తీస్కోవాలి. పుట్టినరోజులు, పెళ్లి రొజు, యానివర్సరి ఒకటా రెండా!  అబ్బా! అన్నీ గుర్తుపెట్టుకుని చెయ్యాలంటే ఎలా?? అందుకే ఉందిగా మనకో డబ్బా, కంప్యూటర్ అనే పేరు తగలేస్కుని, మనల్ని తట్టి చెప్పే పని దానికి పురమాయిద్దాం! ఆ ఒక్క పని చేసేసి ఈసారి మర్చిపోవడం అంటే ఏంటో మర్చిపోదాం!

గువేక్ - గ్నోమ్ లో యాకువేక్


పని చేస్తున్నప్పుడు, మనం మౌస్ ఎక్కువ ఉపయోగించక్కర్లేకుండా కీ బోర్డు తో అన్నీ చక్కబెట్టుకునేల ఉంటే ఆహా, ఆ స్వర్గమే వేరు. అందులోను, నాలుగైదు కీలు పటపట నొక్కక్కర్లేకుండా తక్కువ కీ లతో పనికి అంతరాయం లేకుండా అయిపోయేలా ఉంటే, అది అక్షరాల స్వర్గసౌఖ్యమే! లినక్సు టెర్మినల్ వాడే పద్దతుల్లో ఒకటైన అచ్చం అలాంటి ఒక ఉపకరణం గురించి తెలుసుకుందాం.


లినక్సు వాడేవారిలో ఎక్కువమంది టెర్మినల్ ముట్టుకోకుండా ఉండరు. అసలు ఆ టెర్మినల్ యే వాడకపోతే నాలాంటి వాళ్ళ దృష్టిలో లినక్సు వాడుతున్న పస కోల్పోయినట్టే :) ధనాధన టెర్మినల్ విండో లు మార్చుకుంటూ, కాపీ పేస్టు లకి షార్ట్ కట్  లు వాడుకుంటూ, మాటిమాటికి ఆల్ట్-ట్యాబు కొట్టక్కర్లేని విధంగా అనువుగా టెర్మినల్ ని వాడే విధానం ఎంత ముద్దుగా ఉంటుందో! అసలు ఇలాంటి ఐడియా మనవాళ్ళకి ఒక ఆట నుండి పుట్టింది. క్వేక్ అని ఒక ఆట ఉండి, అందులో ఒక కీ నొక్కితే పైనుంచి యానిమేషన్ తో ఒక విండో దిగుతుంది. అచ్చంగా అలాగే ఒక టెర్మినల్ ఎములేటర్ ని తయారు చేసారు - యాకువేక్ అని. కానీ అది కే.డి.యి కి అనువుగా ఉంటుంది. గ్నోమ్ లో అచ్చం అలాంటిదే ఒక వచ్చింది, గ్నోమ్ కి అనువుగా - గువేక్ అని. దీన్ని ఇన్స్టాల్ చేస్కోవడం చాలా తేలిక.
sudo apt-get install guake


అని కొడితే చక చక ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆల్ట్-f2 కొట్టి, guake అని టైపు చేసి రన్ చేస్తే రన్ అవుతుంది. దాన్ని చూడాలంటే f12 కొట్టాలి. దాచెయ్యాలంటే మళ్ళీ f12 యే కొట్టాలి. దాని విండో మీద రైట్ క్లిక్ కొట్టి, preferences ఎంచుకుని, మీకు కావాల్సిన రంగు, పారదర్శకత, సైజు, షార్ట్ కట్ లు లాంటివి సెట్ చేస్కోవచ్చు. ఇలాంటిదే టిల్డే అని ఇంకోటుంది. అది కూడా ప్రయత్నించాను కాని, ఎన్నో విషయాల్లో గువేక్  దే పై చేయి అనిపించింది. కొన్ని తెరపట్లు ఇవిగోండి.




గువేక్ తెర మొత్తం లో..


 
 

గువేక్ సవరింపులు
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

లినక్సులో FFMPEG

09 November 2009

ఇంతకు ముందు ఒక పోస్టులో FFMPEG విండోస్ లో ఎంత సులువుగా ఉపయోగించవచ్చో చూశాము. ఇప్పుడు, లినక్సు లో FFMPG గురించి వివరాతి వివరంగా తెలుసుకుందాం.


1. ఎలా ఇన్స్టాల్ చేస్కోవాలి?
లినక్స్ లో వచ్చే చిక్కేంటంటే, రకరకాల లినక్సు లు ఉండి, దేనికి దానికే ఒక్కో పద్దతి ఉంటుంది. కాబట్టి అన్నిటికీ పని చేసేలా ఒక పద్దతి చెప్తాను, చేసెయ్యండి! ముందు, ఈ క్రింది చెప్పిన లైబ్రరీ లు అన్నీ ఇన్స్టాల్ చేస్కోవాలి. మీరు వాడే లినక్సులో సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్కొడానికి ఒక ప్యాకేజీ మేనేజర్ ఉంటుంది (ఫెడోరా ఐతే యమ్, ఉబుంటు ఐతే సినాప్టిక్/అప్ట్-గెట్) దానిలో ఈ క్రింది పదాలతో శోదించి, ఆ వచ్చిన ఫలితాల్లో, ఆయా పేర్లతో ఉన్న ప్యాకేజీ లను, వాటి డెవలప్మెంట్ ప్యాకేజీ లను  ఇన్స్టాల్ చేసెయ్యండి. ఒకవేళ మీకు ఆ ప్యాకేజీ మేనేజర్ లు వాడటం తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.
liba52
libgsm
libxvid
libamr
libmp3lame
libogg
libvorbis
libfaac
libfaad
libx264
ఉదాహరణకి, మీరు libogg గురించి శోదిస్తే, అక్కడ వచ్చిన వాటిల్లోంచి libogg0, libogg-dev లను ఇన్స్టాల్ చేయాలి, అలా అన్నిటికీ చెయ్యాలి.  ఇది పూర్తయ్యాక,  ఇక్కడున్న ప్యాకేజీ ని డౌన్లోడ్ చేస్కొండి. ఆ డౌన్లోడ్ చేస్కోగా వచ్చిన ప్యాకేజీ ని ముడి విప్పండి(అంటే untar చేయండి అని, క్రింద, దానికి కూడా కమాండ్ ఇచ్చాను, చూడండి). ఆ తర్వాత, విప్పితే వచ్చిన డైరెక్టరీ కి ఒక టెర్మినల్ లో వెళ్లి, ఈ క్రింది కంమాండ్లు కొట్టండి.
మీరు డౌన్లోడ్ ఎక్కడికి చేసారో, అక్కడికి ఒక టెర్మినల్ లో వెళ్లి, ఇలా ముడివిప్పండి.
tar -xvf ffmpeg-0.5.tar.bz2
ఇప్పుడు ఒక ఫోల్డర్ వస్తుంది. అందులోకి వెళ్ళండి.
cd ffmpeg-0.5
ఇప్పుడు ఈ క్రింది మూడు కంమాండ్లు కొట్టేయండి.
./configure --enable-gpl --enable-libfaac --enable-libfaad --enable-libgsm --enable-libmp3lame --enable-libtheora --enable-libvorbis  --enable-nonfree  --enable-shared --enable-x11grab --enable-libx264 --enable-libxvid --enable-pthreads --enable-libopenjpeg --enable-swscale
make
make install
make కొట్టాక కొంచెం టైం పడుతుంది (కొంచెం అంటే చా.....లా అన్న మాట! హాయిగా బొంచేసి రావచ్చు!). తర్వాత make install కొట్టడం మర్చిపోకండి. అంతా సవ్యంగా అయిపోతే, ఇక మీ పంట పండినట్టే :) అవ్వకుంటే, ఇక్కడ అడిగేస్తే, తెలిసినవారు జవాబిస్తారు.
అక్కడితో ఇన్స్టాల్ చేయడం సమాప్తం! ఇక పని చేస్తుందో లేదో చూడడానికి ఒక రాయి వేద్దాం, ఏదన్నాఆడియో/ వీడియో ఉంటే పట్రండి. మీరు తెచ్చిన ఆ వీడియో పేరు sample.mp3 అనుకుందాం. ఇప్పుడు అది కనీసం ౫ నిమిషాల నిడివి ఉందనుకుంటే, అందులోంచి ౨ నిమిషాల నుంచి ౩ నిమిషాల మధ్యలో ఉన్న ముక్కని ఒక wav లా కట్ చేద్దాం. దానికి ఈ కమాండ్ కొట్టండి.
ffmpeg -sameq -ss 00:02:00 -t 00:01:00 -i sample.mp3 sample.wav
మీరు అనుకున్నట్టు వస్తే మనం కుమ్మేసినట్టే. రాకపోతే, అదేమంటుందో చెప్తూ ఇక్కడ ఒక వ్యాఖ్యలో అడగండి, పరిష్కారం చెప్తాము. వచ్చే పాఠ్యాంశంలో ffmpeg తో మరిన్నినిత్య ఉపయోగకర కంమాండ్ల తో, ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.

లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?



చాలా మంది విండోస్ లో ప్యాకేజీలు ఇన్‌స్టాల్ చేస్కోవడానికి అలవాటు పడి, లినక్సుకి వచ్చేసరికి, కొంచెం తేడాగా ఉండే సరికి, కష్టమేమో అని గాబరాపడిపోతారు. కాని, అది ఒఠ్ఠి భయం మాత్రమే. ఈ పాఠ్యాంశంలో ఉబుంటు, ఫెడోరాలలో కొత్త పాకేజీలు ఎలా ఇన్‌స్టాల్ చేస్కోవాలో చూద్దాం.






ఉబుంటు ఐతే

ఉబుంటు లో మొత్తం మూడు పద్దతుల్లో ఇన్స్టాల్ చేస్కోవచ్చు. ఒక్కక్కటి చూద్దాం. ముందు మనం, ప్రాధమికంగా సిస్టం ని ప్యాకేజీ లు తెచ్చుకునే విధంగా సెటప్ చేస్కోవాలి. ఉబుంటు ఇన్స్టాల్ చేసిన కొత్తలో, ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్లని తీసెయ్యడం తప్పితే కొత్త అప్లికేషనులు తెచ్చుకోవడానికి ఉండదు. కానీ, మనం కొన్ని సోర్సులు కలిపితే ఆ సౌలభ్యం కల్పించుకున్నవారమవుతాం. దానికి ఇలా చేయాలి.
System లో Administration లో Synaptic Package Manager ఉంటుంది. దాన్ని తెరవండి. అది ఇలా బొమ్మలో లాగా ఉంటుంది.



ఒకవేళ మీకు మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినవారు ప్రాక్సి సర్వర్ వివరాలు ఇచ్చివుంటే ఈ స్టెప్ లో ఉన్నది చెయ్యండి. లేదంటే ఈ స్టెప్ అవసరం లేదు. సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ లో పైన మెనూ లో Settings లో Preferences నొక్కితే, ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా. అందులో, Network ట్యాబు కి వెళ్లి, అక్కడ మీ ప్రాక్సి వివరాలు ఇచ్చేయండి.

ఇందులో, పైన మెనూ లో ఉన్న Settings లో Repositories మీద కొడితే, ఇంకో విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా. అక్కడ, Ubuntu Software ట్యాబు క్రింద ఉన్నవన్నీ టిక్ చేసెయ్యండి. పక్కన Other Software లో డీఫాల్ట్గా ఉన్నవాటిని టిక్ చేసెయ్యండి. ఇదే విండో లో, updates ట్యాబు లో మీ సిస్టం తాజాకరణ వివరాలు సవరించుకోవచ్చు. ఇక ఆ విండో మూసెయ్యండి. ఇప్పుడు మర్చిపోకుండా, మొదటి విండో లో పైన ఉన్న Reload బటన్ కొట్టడం మర్చిపోవద్దు! అది కొడితే, మీరు కొత్తగా టిక్ పెట్టిన సైటుల్లోనుంచి ఉన్న ప్యాకేజీ వివరాలు లోడ్ చేస్తుంది. మీరు గమనించాల్సిన విషయం - రీలోడ్ చేసినప్పుడు ప్యాకేజీలను డౌన్లోడ్ చేయదు, వాటి వివరాలు -  పేరు, అదేం చేస్తుంది లాంటివి, మాత్రమే తెస్తుంది.





ఇక సెటప్ పూర్తయ్యినట్టే! ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేయడం అరటిపండు ఒలిచి నోటి దగ్గర పెడితే తిన్నట్టే ఉంటుంది.
౧. సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్
ఇప్పటి దాకా, మనం పైన చెప్పుకున్న సెటప్ అంతా చేసింది ఇందులోనే. దీన్ని తెరవడానికి, System లో  Administration లో ఉన్న Synaptic Package Manager ని క్లిక్ చేయాలి. ఇందులో, పైన ఒక శోధన బాక్స్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన పదాలతో వెతికితే ఫలితాలు చూపిస్తుంది. ఉదాహరణకి ఈ బొమ్మలో చూడండి. mplayer అని వెతికితే వచ్చిన ఫలితాలవి. ఫలితాలు వచ్చాక, అందులో మనకు కావాల్సిన ప్యాకేజీ పక్కన ఉన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే, Mark for Installation అని చూపిస్తుంది. అది కొట్టాలి. ఒకవేళ మీరు కోరుకున్న ప్యాకేజీ కోసం ఇంకేమన్నా ప్యాకేజీ లు తేవాలి అంటే అది మీకు చెప్తుంది, సరేనని కొట్టేయ్యండి. అన్నీ మార్క్ చేసాక,సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ విండో లో పైన Apply అని ఉంటుంది. అది కొడితే, ఎన్ని ప్యాకేజీ లు మార్క్ చేసారు, ఎంత డౌన్లోడ్ చేయాలి, ఎంత నిలువ ఆక్రమిస్తుంది లాంటి వివరాలన్నీ చూపిస్తుంది. సరేనని కొట్టేస్తే ఇన్స్టాల్ చేసేస్తుంది.


౨. ఆడ్/రిమూవ్ అప్లికేషను
ఇది కూడా సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ లాంటిదే. కాకపోతే ఇందులో అక్కడ ఉన్నన్ని అమరికలు ఉండవు. కాస్త తేలిగ్గా ఉంటుంది. దీన్ని తెరవాలంటే, మెయిన్ మెనూ లో, Add/Remove Applications ని క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావాల్సిన ప్యాకేజీ వెతుక్కుని టిక్ చేసి, క్రింద Apply అని ఉంటుంది, దాన్ని కొడితే ఇన్స్టాల్ చేసేస్తుంది.

. అప్ట్-గెట్
ఇక టెర్మినల్ ని ప్రాణప్రదంగా చుస్కునే వారికి ఎప్పుడు లోటు చెయ్యదు లినక్సు! మనం మొదట్లో కొన్ని సోర్సులు కలిపాం చూసారు? అవి ఇక్కడ కూడా కలపొచ్చు. ఎలా అంటే, ముందు ఒక టెర్మినల్ తెరిచి పెట్టుకోండి. ఇక క్రింది కంమాండ్లు ఏమేం చేస్తాయో చూడండి.
ls -R /etc/apt/
/etc/apt డైరెక్టరీ లో మన ప్యాకేజీ మేనేజర్ల వివరాలన్నీ ఉంటాయి.ఆ పై కమాండ్ ఆ డైరెక్టరీ లో ఉన్నవన్నీ చూపిస్తుంది. ఉదాహరణకి, అందులో, /etc/apt/sources.list, /etc/apt/sources.list.d/ లో ఉన్న ఇంకో ఫైల్, రెంటినీ చూడండి. మనం ఇందాక పైన కలిపిన సోర్సులు ఇక్కడ కనబడతాయి. మనం ఇక్కడే కలుపుకోవచ్చు కూడాను. లైన్ కి ముందు deb ఉంటే అది ఒక సోర్సు కి సంబంధించిన లైన్ అని గుర్తించాలి. ఒకవేళ # ఉంటే అది ప్రస్తుతానికి వాడకం లేదని గుర్తిచాలి. ఒకవేళ మీరు దాన్ని వాడాలి అంటే ఆ # ని తీసెయ్యాలి.
ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఒక కమాండ్ తో పని అంటే! ఉదాహరణకి మనం mplayer ఇన్స్టాల్ చేస్కోవాలి అనుకుందాం.
sudo apt-get install mplayer
అని కొడితే సరిపోతుంది. ఒకవేళ ఒక ప్యాకేజీ ని తీసెయ్యాలి అంటే,
sudo apt-get remove mplayer
అంటే సరిపోతుంది. మీకు ప్యాకేజీ పేరు తెలియకపోతే, ఈ క్రింది కమాండ్ తో శోధించవచ్చు.
sudo apt-cache search mplayer
ఇంక చెలరేగిపొండి. మీకు అడ్డే లేదు :)

ఫెడోరా ఐతే:

ఏ మాటకి ఆ మాటేనండి! ఉబుంటు లో ఉన్నంత సౌలభ్యం ఇందులో ఉండదు, గత ౫ ఏళ్లుగా చూస్తున్నా సరే, ఉబుంటు కి ఉన్న సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ కి సరితూగగల ప్యాకేజీ మేనేజర్ ఇందులో కానరాలేదు! అలా అని డీలా పడిపోకండి మరి. ఇందులో yum అనే ఒక అద్భుతమైన సాధనం ఉంది. కాకపోతే ఇది టెర్మినల్ లో మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిలో అసలు గ్రాఫిక్స్ అప్లికేషను ఏ లేదని కాదు, ఉన్నా సరే, దానితో సవా లక్ష సమస్యలు ఎదురవుతుంటాయి. ఇప్పటికి చాలా మంది ఆన్ లైన్ ఫోరం లలో, వీటి గురించి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. కాబట్టి, అన్నిటికంటే మంచి పద్దతి, మనకేమన్నా కోర్కేలుంటే వాటిని కాసేపు చంపుకుని, yum ని వాడుకోవడమే. మీరు ససేమిరా మేము వాడము, మాకు గ్రాఫిక్స్ విండో కావాలి అంటే, విక్రమార్కులు మరి మిమ్మల్ని ఆపగలమా, అలాగే కానివ్వండి - మెయిన్ మెనూ లో Add/Remove Softwares అని ఉంటుంది, అది నొక్కితే ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా, ఇంక మీ తిప్పలు మీరు పడండి :) Yum వాడతానన్నవాళ్ళు మాత్రం ఇంకా చదవి సుఖపడండి :)






ఒక టెర్మినల్ తెరిచి, ఈ క్రింది కమాండ్ కొట్టండి, ఒక ఫైల్ తెరుచుకుంటుంది.
su -c 'vim /etc/yum.conf'
ఒకవేళ, మీ నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చినవారు, మీకు ప్రాక్సి సర్వర్ వివరాలు ఇచ్చి ఉంటే, వాటిని ఈ క్రింది ఫార్మటు లో ఆ ఫైల్ లో ఒక లైన్ గా పెట్టాలి.
proxy=http://192.34.35.11:3128
అంటే, URL:port ఫార్మటు అన్న మాట.
ఇక ఆ ఫైల్ ని సేవ్ చేసేసి (ఎస్కేప్ కొట్టి, : కొట్టి, wq కొట్టండి), ఈ క్రింది కమాండ్ కొట్టండి.
ls /etc/yum.repos.d
అక్కడ, మీకు డీఫాల్ట్ గా వచ్చిన రిపాసిటరిలు అన్నీ కనిపిస్తాయి. అందులో మచ్చుకకి ఒక ఫైల్ తెరవండి, క్రింది కమాండ్ తో (ఫైల్ పేరు మార్చుకోండి, ఆ డైరెక్టరీ లో ఏమేమి ఫైళ్లు ఉన్నాయో చూసి)
su -c "vim /etc/yum.repos.d/livna.repo"
ఆ ఫైల్ లో ఈ క్రింది ఉన్న లైన్ ఉందేమో చూడండి.
enabled = 0
అలా ఉంటే, ఆ రిపాసిటరి ఉపయోగించబడటం లేదు. ఉపయోగించాలంటే, దాన్ని ఈ క్రింది విధంగా మార్చాలి.
enabled = 1
ఫెడోరా కి కావాల్సిన చాలా ప్యాకేజీ లు, లివ్నా అనే ఒక రిపాసిటరీ లో ఉంటాయి. అది సెటప్ చేస్కోవడానికి, ఈ క్రింది కమాండ్లు కొట్టండి.
wget -c http://rpm.livna.org/livna-release.rpm
rpm -ivh livna-release.rpm
ఇక అలా, మీకు నచ్చిన రిపాసిటరీలు  అన్నీ సరి చేస్కుకున్నాక, ఇక ఇన్స్టాల్ చేస్కోవడం తేలికే. ఉదాహరణకి, mplayer ఇన్స్టాల్ చేస్కుందాం.
yum -y install mplayer
అని కొడితే సరిపోతుంది. ఒకవేళ ఆ ప్యాకేజీ ని తీసెయ్యాలి అనుకుంటే,
yum remove mplayer
అంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ప్యాకేజీ పేరు తెలియక వెతకాలి అనుకుంటే,
yum search video player
అంటే అదే వెతికి, మీకు ఫలితాల్ని అందిస్తుంది.
మీకు ఇంక ఏమన్నా సందేహాలుంటే అడగండి.

లినక్స్ కమాండ్లతో నావిగేషన్‌

08 October 2009

ఈ టపా లో కొన్ని లినక్సు కమాండ్లను వాడటం ఎలానో నేర్చుకుందాం. ఈ కమాండ్లు  బేసిక్ అని చెప్పొచ్చు. అంటే మనం ఫైల్ సిస్టం లో ఎక్కడ (ఏ ఫోల్డర్ లో) ఉన్నాం. ఇంకో చోటికి వెళ్ళాలంటే ఎలా? ఉన్న ఫోల్డర్ లో ఫైల్స్ చూడాలంటే ఎలా? ఈ విషయాలు చుద్దాం.


దీనికి ముందు లినక్స్ లో ఫైల్స్ ఎలా అమర్చబడతాయో తెలుసుకోవాలి..లినక్స్ లో ఫైల్స్ హైరార్కికల్ గా ( అంటే తిరగేసిన చెట్టు - మొదలు పైకి కొమ్మలు కిందకి  ) అమర్చబడతాయి. దీనినే డైరెక్టరీ స్ట్రక్చర్ అని అంటారు(లినక్స్ లో ఫోల్డర్లను డైరెక్టరీ అని అంటారు). అంటే ఈ డైరెక్టరీలను (తిరగేసిన) చెట్టు లాగ అమర్చుతారన్నమాట. ఈ విధంగానే ఉన్న అన్ని ఫైల్స్, డైరెక్టరీలు అమర్చబడి ఉంటాయి. ఇందులోని మొట్ట మొదటి డైరెక్టరీ ని root అంటారు. దీనిని "/" గుర్తు తో చూపుతారు.ఇక్కడి నుండి అమరిక మొదలై కిందకి చెట్టు లాగ ఫైల్స్ మరియు డైరెక్టరీలు అమర్చబడి ఉంటాయి. ఈ రోజున చాల గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్లు(GUI లు) ఫైల్ మేనేజర్ అనే ఒక ప్రోగ్రాంను అందిస్తున్నాయి. ఉదాహరణకి గ్నోం(Gnome) డెస్క్టాపులో నాటిలస్(nautilus) అనేది ఫైల్ మేనేజర్, కే.డి.ఇ లో కాంకరర్(konqueror) ఉంటుంది.  ఈ ప్రోగ్రాం ద్వార మనం మన ఫైల్ సిస్టం స్ట్రక్చర్ ని చూడొచ్చు. కావాలనుకున్నప్పుడు దానికి అవసరమైన మార్పులు చేయవచ్చు - ఒక ఫోల్డర్/ఫైల్ ని సృష్టించడం, తీసి వెయ్యడం, అమరిక మార్చడం లాంటివి. ఈ క్రింది బొమ్మను చుడగలరు. file_manager.jpg
మిగిలిన OS లకు లినక్స్ / యూనిక్స్ లకు తేడ ఏంటంటే ఇక్కడ డ్రైవ్లను drive letters (C,D,E లాంటివి) తో సూచించరు. అలా చేయడం వల్ల ఒక్క డ్రైవ్ ను ఒక్కో ట్రీ గా చూపించాల్సి వస్తుంది, అదే లినక్స్ లో ఒక ట్రీ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. ఎన్ని డ్రైవ్ లు ఉన్నా అవి ఇందులోనే అమరిపోతాయి. అందువల్ల ఒక డైరెక్టరీ నుండి ఇంకొక డైరెక్టరీ కి వెళ్ళడం చాలా సులువవుతుంది.
  • ఇప్పుడు మనం ఉన్న డైరెక్టరీ ఏదో తెలుసుకోవాలంటే కమాండ్ చుద్దాం. మనం ఇప్పుడు ఉన్న డైరెక్టరీని working directory అంటాం.
కమాండ్: pwd ( present working directory )
ఈ కమాండ్ వల్ల మనం ప్రస్తుతం పని చేస్తున్న డైరెక్టరీ ఏదో తెలుసుకోవచ్చు. ఈ క్రింది బొమ్మను చూడగలరు.
[me@linuxbox me]$ pwd
/home/me
  • ఇప్పుడు ఉన్న డైరెక్టరీలో ఫైల్స్ చూడాలంటే కమాండ్ చుద్దాం.
కమాండ్: ls
ఈ కమాండ్ ద్వారా మన డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని చూడొచ్చు. ఈ కమాండ్ కి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయ్. ఒక కమాండ్ పేరు తెలిస్తే దాని ఆప్షన్స్, దాని గురించి మిగతా సమాచారం ఎలా తెలుసుకోవాలో చివరిలో చూద్దాం.
[me@linuxbox me]$ ls
 Desktop     Xrootenv.0    linuxcmd
GNUstep bin nedit.rpm
GUILG00.GZ hitni123.jpg nsmail

  • ఇంకో డైరెక్టరీకి వెళ్ళాలంటే కమాండ్ ఏదో చుద్దాం.
కమాండ్: cd ( change directory )
ఈ కమాండ్ మనం ప్రస్తుతం ఉన్న డైరెక్టరీ నుండి ఇంకొక డైరెక్టరీ కి వెళ్ళాలంటే ఉపయోగపడుతుంది. ఈ క్రింది బొమ్మను గమనించండి.( ఇక్కడే cd తో పటు pwd, ls లను కూడా చుడవచ్చు. )

[me@linuxbox me]$ cd /usr/X11R6/bin
[me@linuxbox bin]
$
pwd
/usr/X11R6/bin
[me@linuxbox bin]$
ls
 Animate               import                xfwp
AnotherLevel lbxproxy xg3
Audio listres xgal
Auto lndir xgammon

and many more...
అంటే మనం ఏ డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుంటున్నామో దాని దారి (path) cd పక్కన ఇస్తే సరిపోతుంది. ఇలా ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్ అంటారు.
ఇక్కడ దార్లను (path names) రెండు రకాలుగా  విభజించారు.
  • మొదటిది absolute path name. ఇక్కడ path root directory ( అంటే "/" ) నుండి మొదలవుతుంది.
  •  రెండవది relative path name. ఇక్కడ path working directory ( అంటే  "." ) నుండి మొదలవుతుంది. 
ఇక్కడ మనకు ఒక కొత్త గుర్తు కనిపించింది. " . " దీనినే dot operator అంటారు. dot ను ఉపయోగించటం :
  • dot ను ఒకసారి వాడితే అది pwd ని సూచిస్తుంది.( అంటే " . " అని. దీనిని వాడక పోయిన పర్లేదు. మనం నేరుగా దారి ఇచేయోచ్చు )
  • అదే రెండు సార్లు వాడితే అది పేరెంట్ డైరెక్టరీని సూచిస్తుంది. ( అంటే " .. ". దీనిని cd పక్కన ఆర్గ్యుమెంట్ గా చేరిస్తే పేరెంట్ డైరెక్టరీకి తీసుకెళ్తుంది.
ఒకసారి ఉదాహరణ ఒకటి చూద్దాం. క్రింది బొమ్మలను గమనించగలరు. మన ప్రస్తుత డైరెక్టరీని /usr/X11R6/bin కి మార్చుకుని, అక్కడనుండి మొదలెడదాం.
[me@linuxbox me]$ cd /usr/X11R6/bin
[me@linuxbox bin]$ pwd
/usr/X11R6/bin
ఇప్పుడు మన ప్రస్తుత డైరెక్టరీ ని /usr/X11R6/ కి మార్చాలి అనుకుందాం. మనకు రెండూ మార్గాలున్నాయి. ఒకటి absolute path name ఉపయోగించడం. ఇంకోటి relative path name తో చేయడం. రెండూ చూద్దాం. మొదట absolute path name తో, అంటే root నుంచి మన దారి (path) ఏంటో చెప్తూ ఇచ్చే ఆర్గ్యుమెంట్.
[me@linuxbox bin]$ cd /usr/X11R6
[me@linuxbox X11R6]$ pwd
/usr/X11R6
రెండో మార్గమైన relative path name తో చూద్దాం, అంటే మన ప్రస్తుత డైరెక్టరీ("." తో సూచించబడుతుంది) నుండి మనకు కావాల్సిన దారిని సూచిస్తూ ఇచ్చే ఆర్గ్యుమెంట్. మనం ప్రస్తుతానికి /usr/X11R6/bin లో ఉన్నాం.
[me@linuxbox bin]$ cd ..
[me@linuxbox X11R6]$ pwd
/usr/X11R6
అలాగే మనం ఇప్పుడు /usr/X11R6/ నుండి /usr/X11R6/bin కి వెళ్ళాలంటే రెండు మార్గాల్లో వెళ్ళొచ్చు.
absolute path name తో..
[me@linuxbox X11R6]$ cd /usr/X11R6/bin
[me@linuxbox bin]$ pwd
/usr/X11R6/bin
relative path name తో..
[me@linuxbox X11R6]$ cd ./bin
[me@linuxbox bin]$ pwd
/usr/X11R6/bin
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. పైన మనం cd ./bin ఇచ్చిన చోట cd bin అని ఇచ్చిన పని చేస్తుంది. ఎందుకంటే సిస్టం  డీఫాల్ట్ గా relative path name ఇస్తున్నట్టుగా తీస్కుంటుంది. కాబట్టి మీరు relative path name తో పని చేయదలుచుకుంటే ప్రతీసారీ "./" ఇవ్వనక్కరలేదు.

మనం ఇంకో రెండు ముఖ్య విషయాలను చుద్దాం.

  • cd పక్కన ఏమి ఇవ్వక పోతే అది మీ హోం డైరెక్టరీకి చేరుస్తుంది. ( ప్రతి యూజర్ కి ఇన్స్టలేషన్ సమయంలో  ఒక హోం డైరెక్టరీ తయారు చేసి ఇవ్వబడుతుంది. అది మామూలుగా /home// అయిఉంటుంది. అంటే మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంచుకున్న మీ వినియోగదారునామం.
  • అదే మనం cd ~username ( ఇక్కడ user-name అంటే ఇంకొక యూసెర్ పేరు. ) అని ఇస్తే ఆ యూసెర్ యొక్క హోం డైరెక్టరీ కి మనల్ని చేరుస్తుంది. cd కి ఉత్తి ~ అని ఆర్గ్యుమెంట్ ఇస్తే (అంటే cd ~ అని ఇస్తే)మన హోం డైరెక్టరీ కి తీస్కుని వెళ్తుంది, ఏమీ ఇవ్వనట్టు.
ls యొక్క ఆప్షన్స్, ఇంకొన్ని కంమాండ్లు తర్వాతి టపాలో చుద్దాం. ఈ లోపు మీకు ఆ కంమాండ్ల గురించి తెలుసుకోవాలని ఉంటే man అనే కమాండ్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ls గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే man ls అని ఇస్తే ls గురించి ఉన్న మాన్యువల్ చూపిస్తుంది. దీని గురించి మరిన్ని విశేషాలు రానున్న పాఠ్యాంశాల్లో చూద్దాం.

Source: http://www.linuxcommand.org/lts0020.php © 2000-2009, William Shotts, Jr.

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English