Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

హార్డ్ డిస్క్ పై ఐదో భాగం - ఫైల్ రికవరీ

28 November 2009



పొరపాటున మనకు కావాల్సిన ముఖ్యమైన ఫైల్ పోగొట్టుకుంటే ఉందే బాధ అంతా ఇంతా కాదు! ఈ పాఠ్యాంశంలో అలా డిలీట్ చేసిన ఫైల్ ని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం.



వెబ్/నెట్ ఎలా పని చేస్తుంది?

ఈ చిన్న కథ మీరు రోజు వాడుతున్న ఇంటర్నెట్ ఎలా పని చేస్తుందో చెప్తుంది.

ప్రఖ్యాత వెబ్ ఆర్కిటెక్చర్లు


ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ ఎలా వేసుకుంటామో, ఇంటర్నెట్ పని చేయడానికి కూడా అలాంటి ఒక ప్లాన్ అవసరం. మన అవసరాన్ని బట్టి ఆ ప్లాన్ మార్చుకుంటాం. ఇంటర్నెట్ ప్రస్తుత స్థితిలో, ముఖ్యంగా రెండు ఆర్కిటెక్చర్లు ఉపయోగంలో ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం



హార్డ్ డిస్క్ పై నాలుగో భాగం - పార్టిషన్లతో పని చేయడం

19 November 2009


మొదటి మూడు భాగాలలో, హార్డ్ డిస్క్ గురించిన ముఖ్యమైన ప్రాధమిక సమాచారం తెలుసుకున్నాం. ఫైల్ సిస్టం లు అంటే ఇప్పుడు మనకో మంచి అవగాహన ఉంది. ఈ పాఠ్యాంశంలో కాస్త తనువూ, మనసూ శ్రద్ధతో నిమగ్నం చేసి (అంటే మన వాడుకలో, ఒళ్ళు దగ్గరపెట్టుకుని :) ) చేయాల్సిన విషయాలు చూద్దాం - అవే, పార్టిషన్లు సృష్టించడం, సైజు మార్చడం, తొలగించడం.

ముందుగా మీరు ఒక విషయం తప్పకుండ గమనించాలి! మీరు ఏ చిన్న తప్పు చేసినా మీ హార్డ్ డిస్క్ మీదున్న డేటా కి చాలా పెద్ద ప్రమాదమే వస్తుంది! కాబట్టి, మీకు ముఖ్యమైన ఫైళ్లు గట్టా ఉంటే ముందు అవి వేరే కంప్యూటర్ కో ఒక సిడి లోకో కాపీ చేస్కొండి.

హార్డ్ డిస్క్ పై మూడో భాగం - ఫైల్ సిస్టంలు


మొదటి రెండు భాగాలలో హార్డ్ డిస్క్ గురించిన ప్రాధమిక అవగావానకి కావాల్సినవి చూశాం. హార్డ్ డిస్క్ తనువైతే, ఫైల్ సిస్టం ఆత్మ. అదెలాగో, ఫైల్ సిస్టం ఏంటో చూద్దాం.

హార్డ్‌డిస్క్ గురించి తెలుసుకుందాం - రెండవ భాగం

మొదటి భాగంలో, అసలు హార్డ్ డిస్క్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, పార్టిషన్ అంటే ఏంటి, వాటి వివరాలు ఎలా చూడాలి అన్న అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు, పార్టిషన్లు  ఎందుకు, ఎన్ని పెట్టుకోవాలి, మీకు తెలియకుండా జాగా మొత్తం కబ్జా అయిపోతే ఏం చేయాలి లాంటి వివరాలు తెలుసుకుందాం.

హార్డ్‌డిస్క్ గురించి తెలుసుకుందాం - మొదటి భాగం



ఈ పాఠ్యాంశంలో మనం హార్డ్ డిస్క్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, పార్టిషన్ అంటే ఏంటి, వాటి వివరాలు ఎలా చూడాలి అన్న అంశాలు నేర్చుకుందాం. మీకు లినక్స్ఇన్‌స్టాల్ చేసిన కంప్యూటర్ ఉంటే, ఇందులో చెప్పేవి మీరు కూడా ప్రయత్న పూర్వకంగా చేసినట్టు ఉంటుంది. విండోస్ వాడేవాళ్ళు, ఏమి చేయనక్కర్లేదు, చూస్తే సరిపోతుంది :) కాకపోతే చేసే త్రిల్ ఉండదు :) మీకు టెర్మినల్ గురించి అస్సలు తెలియకపోతే కనుక, తెలుగుస్తానం లో ఉన్న "షెల్ గూర్చి నేర్చుకుందాం" అనే ట్యూటోరియల్ చదివితే ఒక అవగాహన వస్తుంది.





ఇక విషయం లోకి వస్తే,
కంప్యూటర్ కొన్నప్పడు, కొత్త ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేస్కునేటప్పుడు ఇలా చాలా సమయాల్లో హార్డ్‌డిస్క్ గురించి, దానికి సంబందించిన పనుల గురించి వింటూ ఉంటాం. ఈ పాఠ్యాంశంలో హార్డ్‌డిస్క్ కంప్యూటర్ లో ఎలా ఉపయోగపడుతుందో, మనం తీస్కోవాల్సిన జాగ్రత్తాలేంటో చూద్దాం. మీరు లినక్స్ లోను, విండోస్ లోను, స్టార్ట్ మెనూ లో ఉన్న ప్లేసెస్ లో "కంప్యూటర్" మీద క్లిక్ చేస్తే ఒక విండో తెరుచుకుంటుంది. ఇలాగ..




అందులో మన సిస్టమ్ లో ఉన్న పార్టిషన్ లన్నీ చూపిస్తుంది. ఇప్పుడు వాటి వెనకున్న విషయాలు ఎంటో తెలుసుకుందాం.

కంప్యూటర్ లో శాశ్వతంగా నిక్షిప్త పరచాల్సిన సమాచారాన్ని దాచడానికి ఉపయోగపడే సాధనం హార్డ్‌డిస్క్. అంటే పవర్ సప్లై లేకపోయినా, మీరు పొందుపరిచిన సమాచారం అలాగే ఉండేలా చూసే ఒక ఆధారం. దాన్ని ఉపయోగించే విధానం లో, జాగ్రత్తగా గమనిస్తే, దానికి ఇల్లుకి చాలా దగ్గర పోలిక ఉంటుంది. మనం ఒక గది నిర్మాణానికి కావాల్సిన జాగాని మీటర్లలోనో, అడుగులలోనో కొలుస్తాం. అలాగే, హర్డ్‌డిస్క్ లో జాగాని, బైట్స్ లో కొలుస్తారు. 1000 బైట్ లు ఐతే 1 కిలోబైట్ అని, 1000 కిలోబైట్లు ఐతే ఆది ఒక మెగబైట్ అని, 1000 మెగబైట్లు ఐతే ఆది 1 గిగాబైట్ అని అంటాం, అంటే 1 జి.బి  అన్నమాట. ఒక గది కట్టాలి అంటే దానికి కొంత ఖాళి స్థలం ఎలా అవసరమో, ఒక కొత్త పార్టిషన్‌ కావాలి అనుకుంటే హార్డ్‌డిస్క్ లో కొంత ఖాళీ జాగా కూడా అలాగే అవసరం.

గది కట్టిన తర్వాత గోడలు, మెట్లు లాంటివి కొంత బాగం ఆక్రమించుకున్నట్టే, హార్డ్‌డిస్క్‌ లో ఆ పార్టిషన్‌ నిర్మాణ సమాచారం  కూడా హార్డ్‌డిస్క్‌లో కొంత జాగా ఆక్రమిస్తుంది.(ఇది బయటకి మనకు కనబడదు, జాగా కూడా చాలా తక్కువే అనుకోండి, కానీ ఆ పార్టిషన్ ఆపరేటింగ్ సిస్టం (OS) తో ఎలా అనుసందానించబడుతుందో తెలుసుకోవడానికి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవడం దోహద పడుతుంది. ఈ నిర్మాణ విధానాన్నే మనం ఫైల్ సిస్టమ్ అంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫైల్ సిస్టమ్ అంటే గది కట్టే విధానం. ఒక్కొక్క కట్టడానికి కొన్ని కొన్ని బలాలు, బలహీనతలు  ఉన్నట్టే, ఒక్కో ఫైల్ సిస్టం కి కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయి. అవి వచ్చే పాఠ్యాంశంలో చూద్దాం. పార్టిషన్ లో మనం పెట్టె ఫైళ్లు అందులో బద్రపరచబడే విధానం కూడా ఫైల్ సిస్టం ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కోసారి, కొన్ని ఫైల్ సిస్టమ్ లలో, ఫైల్స్ అమరిక చిందరవందరగా తయారవడం వల్ల హార్డ్‌డిస్క్ నుంచి వాటిని ఉపయోగిచాలంటే టైమ్ ఎక్కువ పడుతుంది, దీని వల్ల సిస్టమ్ నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ఇది విండోస్ లో ఫ్యాట్(FAT) ఫైల్ సిస్టమ్ వాడే వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు డీ-ఫ్రాగ్‌మెంట్ చేయాలి. ఈ-నాడులొ డీ-ఫ్రాగ్‌మెంటేషన్‌ పాఠ్యాంశం చదివి అదెలాగో తెలుసుకోండి. ఇక తర్వాత ఆ పార్టిషన్ ఉపయోగించేటప్పుడు, మనం దాని మీద బద్రపరిచే ప్రతి ఫైల్ కొంత బాగాన్ని ఆక్రమిస్తుంది.

ఇప్పుడు చెప్పుకున్న వాటికి సంబందించివన్నీ ఒకసారి లినుక్సు లో చూద్దాం. లినక్సులో ఇలాగే కాక, విండోస్ లో చూసినట్టే చూసే మార్గాలు కూడా ఉన్నాయి. ఐతే, ఇక్కడ నేనెంచుకున్న మార్గం టెర్మినల్‌ని మీకు దగ్గర చేసి, తర్వాత్తర్వాత మీకు ఉల్లీ, తల్లీ కలిపి చేసినా చేయని మేలు చేస్తుంది. ముందు. మన హార్డ్‌డిస్క్ సైజ్ ఎంతో, ఆది ప్రస్తుతానికి ఎన్ని పార్టిషన్లగా విభజించబడిందో చూద్దాం.  ఈ క్రింది చూపిన కమాండ్ కొడితే ఆ బొమ్మలో లాగా వస్తుంది అవుట్పుట్. విండోస్ లో ఉన్నవారు, My Computer మీద రైట్ క్లిక్ చేసి, Manage ఆప్షన్‌ ఎంచుకోండి, ఒక విండో తెరుచుకుంటుంది. అక్కడ Disk Utilities ఉంటుంది, అది ఎంచుకుంటే కనిపిస్తుంది.

sudo fdisk -l



fdisk -l కమాండ్ అవుట్పుట్

ఇప్పుడు ఒక పార్టిషన్ సైజ్, ఎంత ఉపయోగించబడింది, ఎంత జాగా మిగులుంది లాంటి వివరాలు చూద్దాం. ఈ క్రింది కమాండ్ కొట్టండి. అక్కడున్న /dev/sda2 ని మీకు పైనున్న fdisk -l అవుట్పుట్లో చూపించిన పార్టిషన్‌ల లోనుంచి ఒకదానితో మార్చి ఇవ్వాలి కమాండ్. విండోస్ వాడేవారు My Computer మీద నొక్కితే, అక్కడా ఒక్కక్క డ్రైవ్/పార్టిషన్‌ వివరాలు కనిపిస్తాయి.
sudo df -h /dev/sda2

df -h /dev/sda2 కమాండ్ అవుట్పుట్

ప్రస్తుతానికి OS ఎక్కుపెట్టిన మొత్తం పార్టిషన్‌లని చూడాలి అనుకుంటే ఉత్తినే df -h కొడితే సరిపోతుంది. అంటే, ప్రస్తుతానికి మనం వాడగలిగే పార్టిషన్ల వివరాలన్నమాట.
df -h
 

df -h అవుట్పుట్

తర్వాతి పాఠ్యాంశంలో పార్టిషన్లు  ఎందుకు, ఎన్ని పెట్టుకోవాలి, మీకు తెలియకుండా జాగా మొత్తం కబ్జా అయిపోతే ఏం చేయాలి లాంటి వివరాలు తెలుసుకుందాం. అసలు హార్డ్‌డిస్క్ ని ఇంటితో ఎందుకు పోల్చానో అందులో బాగా అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది.

జి నోమ్ షెడ్యూల్ - అలారాలు - మర్చిపోవడం మర్చిపోండి!

16 November 2009


పొద్దున్నే టైం కి లేవాలి, లేచాక శతకోటి ముఖ్యమైన పనులు చేయాలి. అందులో సవాలక్ష పనులు గుర్తుండనే ఉండవు. రోజూ ఫలానా టైం కి ఫలానా ప్రోగ్రాం రన్ చేయాలి, ఫలానా టైం కి బ్యాక్ అప్ తీస్కోవాలి. పుట్టినరోజులు, పెళ్లి రొజు, యానివర్సరి ఒకటా రెండా!  అబ్బా! అన్నీ గుర్తుపెట్టుకుని చెయ్యాలంటే ఎలా?? అందుకే ఉందిగా మనకో డబ్బా, కంప్యూటర్ అనే పేరు తగలేస్కుని, మనల్ని తట్టి చెప్పే పని దానికి పురమాయిద్దాం! ఆ ఒక్క పని చేసేసి ఈసారి మర్చిపోవడం అంటే ఏంటో మర్చిపోదాం!

గువేక్ - గ్నోమ్ లో యాకువేక్


పని చేస్తున్నప్పుడు, మనం మౌస్ ఎక్కువ ఉపయోగించక్కర్లేకుండా కీ బోర్డు తో అన్నీ చక్కబెట్టుకునేల ఉంటే ఆహా, ఆ స్వర్గమే వేరు. అందులోను, నాలుగైదు కీలు పటపట నొక్కక్కర్లేకుండా తక్కువ కీ లతో పనికి అంతరాయం లేకుండా అయిపోయేలా ఉంటే, అది అక్షరాల స్వర్గసౌఖ్యమే! లినక్సు టెర్మినల్ వాడే పద్దతుల్లో ఒకటైన అచ్చం అలాంటి ఒక ఉపకరణం గురించి తెలుసుకుందాం.


లినక్సు వాడేవారిలో ఎక్కువమంది టెర్మినల్ ముట్టుకోకుండా ఉండరు. అసలు ఆ టెర్మినల్ యే వాడకపోతే నాలాంటి వాళ్ళ దృష్టిలో లినక్సు వాడుతున్న పస కోల్పోయినట్టే :) ధనాధన టెర్మినల్ విండో లు మార్చుకుంటూ, కాపీ పేస్టు లకి షార్ట్ కట్  లు వాడుకుంటూ, మాటిమాటికి ఆల్ట్-ట్యాబు కొట్టక్కర్లేని విధంగా అనువుగా టెర్మినల్ ని వాడే విధానం ఎంత ముద్దుగా ఉంటుందో! అసలు ఇలాంటి ఐడియా మనవాళ్ళకి ఒక ఆట నుండి పుట్టింది. క్వేక్ అని ఒక ఆట ఉండి, అందులో ఒక కీ నొక్కితే పైనుంచి యానిమేషన్ తో ఒక విండో దిగుతుంది. అచ్చంగా అలాగే ఒక టెర్మినల్ ఎములేటర్ ని తయారు చేసారు - యాకువేక్ అని. కానీ అది కే.డి.యి కి అనువుగా ఉంటుంది. గ్నోమ్ లో అచ్చం అలాంటిదే ఒక వచ్చింది, గ్నోమ్ కి అనువుగా - గువేక్ అని. దీన్ని ఇన్స్టాల్ చేస్కోవడం చాలా తేలిక.
sudo apt-get install guake


అని కొడితే చక చక ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆల్ట్-f2 కొట్టి, guake అని టైపు చేసి రన్ చేస్తే రన్ అవుతుంది. దాన్ని చూడాలంటే f12 కొట్టాలి. దాచెయ్యాలంటే మళ్ళీ f12 యే కొట్టాలి. దాని విండో మీద రైట్ క్లిక్ కొట్టి, preferences ఎంచుకుని, మీకు కావాల్సిన రంగు, పారదర్శకత, సైజు, షార్ట్ కట్ లు లాంటివి సెట్ చేస్కోవచ్చు. ఇలాంటిదే టిల్డే అని ఇంకోటుంది. అది కూడా ప్రయత్నించాను కాని, ఎన్నో విషయాల్లో గువేక్  దే పై చేయి అనిపించింది. కొన్ని తెరపట్లు ఇవిగోండి.




గువేక్ తెర మొత్తం లో..


 
 

గువేక్ సవరింపులు
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

వెబ్ సర్వీసు, Web Service

10 November 2009


వెబ్ సర్వీసు అనగా ఏమిటి, ఎలా పనిచేస్తుంది, దీని వలన ఉపయోగాలు ఏమిటో తెలుసుకొనుట.

వెబ్ సర్విసు అనగా భవిష్యత్తు విలువలలో, ఈ-వ్యాపారంలో మార్పు తెచ్చేఒక సాంకేతిక పరిజ్ఞానము. వెబ్ సర్వీసు మన అప్లికేషనును, వెబ్ అప్లికేషను గా మార్చుతుంది. వెబ్ అప్లికేషను దాని పనిని ప్రకటించును లేదా ఈ వార్తను మిగిలిన ప్రపంచానికి తెలియజేయును. నెట్వర్క్ ద్వారా ప్రపంచం లోని వివిధ రకాల కంప్యూటర్లు, విస్తరించి ఉండటానికి  ఈ వెబ్ సర్వీసు తనవంతు వాతావరణాన్ని అమరుస్తుంది.

  • వెబ్ సర్వీసు, అప్లికేషను లోని ముఖ్య భాగాలలో ఒకటి.
  • వెబ్ సర్వీసు, ఓపెన్ ప్రోటోకాల్ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • వెబ్ సర్వీసు, తనను తను వివరించును, తనలో తను కలిగియుండును.
  • వెబ్ సర్వీసు ను యుడిడిఐ ద్వారా కనుగొనవచ్చును.
  • ఒక వెబ్ సర్వీసు,  మరొక అప్లికేషను చేత ఉపయోగింపబడవచ్చును
  • వెబ్ సర్వీసు కు పునాది యక్స్ యమ్ యల్
వెబ్ సర్వీసు కు మూలకారణము యక్స్ యమ్ యల్ మరియు హెచ్  టి టి పి. 
యక్స్ యమ్ యల్( యక్సటెన్డెడ్ మార్కుప్ లాంగ్వేజ్  )
కఠినతరమైన వార్తలను, పనులను వివిధ రకాల ప్లాట్ ఫోరమ్స్ మరియు ప్రోగ్రామింగ్ భాష ల మధ్య విస్తరింప చేయుటకు ఉపయోగించే భాషను యక్స్ యమ్ యల్ అంటారు.
హెచ్  టి టి పి (హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ ఫర్  ప్రోటోకాల్)
హెచ్  టి టి పి   ప్రోటోకాల్ సాధారణముగా వాడే ఇంటర్నెట్ ప్రోటోకాల్.

వెబ్ సర్విసు ప్రాధాన్యతలు

  • ఇంటరోపెరబిలిటి:- సాధారణంగా ఒక అప్లికేషను ఒక ప్లాట్ ఫాం మీద మాత్రమే పనిచేయును. కానీ ఒక అప్లికేషను వెబ్ లో పనిచెయ్యాలంటే అది వివిధ రకాల ప్లాట్ ఫోరమ్స్ మీద పనిచెయ్యవలసి ఉంటుంది. ప్రపంచం లోని వివిధ రకాల ప్లాట్ ఫార్మ్స్ కలసి ఒక చోట పనిచేయ్యటాన్ని వెబ్ బ్రౌజరు అంటారు.ఇలా వివిధ రకాల  ప్లాట్ ఫార్మ్స్ కలసి ఒక చోట పనిచెయ్యటానికి కావలసిన వివరణను వెబ్ అప్లికేషను అంటారు. ఒక సాధారణ అప్లికేషను, వెబ్ లొ పని చేయుచున్నచో దానిని వెబ్ అప్లికేషను అంటారు.వెబ్ అప్లికేషనును వెబ్ బ్రౌజరు పరిమాణమునకు తగినట్లుగా రూపొందించిన అది ఏ బ్రౌజరు మీద నైన, ఏ ప్లాట్ ఫాం మీద నైన పనిచేయును. వెబ్ అప్లికేషనును యక్స్ యమ్ యల్ భాష లో రాయటం చాలా సులువు. కనుక ఒక అప్లికేషను వెబ్-అప్లికేషనుగా  యక్స్ యమ్ యల్ భాషను ఉపయోగించి మార్చినచో దానిని మనం వివిధ రకాల ప్లాట్ ఫాంల మీద ఉపయోగించుకోవచ్చును.
  • ఫైర్వాల్ :- వెబ్ సర్వీసుకు ఫైర్వాలును ఎదిరించ గల సామర్ధ్యం ఉన్నది. వెబ్ సర్వీసు హెచ్ టి టి పి ప్రోటోకాలును ఉపయోగించటం ద్వారా సులువుగా ఫైర్వాలు లను దాటగలవు.
వెబ్ సర్వీసు పని తీరు
వెబ్ సర్వీసు ప్రొవైడర్లు ,వెబ్ సర్వీసును ఇచ్చువారు, తమ వెబ్ అప్లికేషనులను వెబ్ సర్వీసు రేజేస్ట్రీ లో పొందుపరచి ఉంచుతారు. క్లైంట్ ,ఎవరైతే అప్లికేషన్ ను ఉపయోగించుకోవాలనుకొంటారో వారు, ఆ వెబ్ సర్వీసు రేజేస్ట్రీలో తమకు కావలసిన అప్లికేషను కోసం వెతకుతారు. క్లైంటుకు కావలసిన అప్లికేషను దొరికినప్పుడు  ఆతను దానిని ఎంచుకోవచ్చును. ఇలా ఎంచుకొన్న అప్లికేషనును డౌన్ లోడ్ చేసుకొని దానితో బంధాన్ని ఏర్పరచుకొని దానిని ఉపయోగించుకొంటారు. అంటే ఇది పూర్తిగా వెబ్ సర్వీసు ప్రొవైడరుతో బంధాన్ని ఏర్పరచుకొని ఉపయోగించుకోవటమే.


    
వెబ్ సర్వీసు ఉపయోగాలు
  • నెట్వర్క్ ద్వారా ఒక పనికి సంబంధించిన వివరాలను విస్తరింపచేయుటకు వెబ్ సర్వీసు ఉపయోగపడుతుంది. ఇలా వెల్లడి చేసిన పనిని ఏ ఇతర అప్లికేషనులు ఐనా ఉపయోగించుకోవచ్చును.
  • వెబ్ సర్వీసును ఉపయోగించి వివిధ రకాల అప్లికేషనులు తమ వివరాలను మరియు పనులను పరస్పరం పంచుకోవచ్చును. ఉదాహరణకు .నెట్ అప్లికేషను ,జావా వెబ్ సర్వీసు తో మాట్లాడగలదు అలాగే ఒక జావా అప్లికేషను, .నెట్ వెబ్ సర్వీసు తో మాట్లాడగలదు.
  • వెబ్ సర్వీసు, సమాచారాన్ని పంపుటకు పరిశ్రమల ప్రమాణాలకు సరిపోయే ప్రోటోకాల్ ప్రమాణమును ఉపయోగించును.దీని ద్వారా సమాచారాలు పంపుటకు ఖర్చు తక్కువై ,వాటి నాణ్యత పెరుగుతుంది.
  • సాధారణముగా వెబ్ సర్వీసు ఉపయోగించే ప్రోటోకాల్ ప్రమాణము యస్ఓఏపి మరియు హెచ్ టి టి పి. ఈ ప్రోటోకాల్ ప్రమాణమును మాత్రమే కాక మనం ఇతర ప్రోటోకాల్ లను కూడా వాడవచ్చును. ఉదాహరణకు ఎఫ్ టిపి మీద వెబ్ సర్వీసు. కనుక  ఒక వెబ్ సర్వీసు ద్వారా ఎటువంటి సమాచారాన్ని ఐన పంపించవచ్చును.
  • వెబ్ సర్వీసు ఒక లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉండదు. కాబట్టి దానిని ఏ సాంకేతిక పరిజ్ఞానములో రూపొందించిన ఇతర అప్లికేషన్ ఐన ఉపయోగించవచ్చును. దీని వలన బి2బి బాగా వృద్ది చెందుతుంది.
  • వెబ్ సర్వీసు తనను తాను వివరించుకుంటుంది కాబట్టి ఇతర వ్యాపార భాగస్తులు అప్లికేషన్ ను రూపొందించుటకు తక్కువ సమయం పడుతుంది మరియు ఖర్చును కూడా తగ్గించును.
  • వెబ్ సర్వీసు ద్వారా సులువుగా వ్యాపారస్తులు కావలసిన సర్వీసు ప్రొవైడర్స్ ను కలవవచ్చును. కనుక వ్యాపారము త్వరగా వృద్ది చెందుతుంది.
వెబ్ సర్వీసు మూలా భాగాలు
వెబ్ సర్వీసు మూడు మూల భాగాలను కలిగి ఉన్నది. అవి
  • యస్ ఓ ఏ పి
  • డబ్ల్యు యస్ డి యల్
  • యు డి డి ఐ
యస్ ఓ ఏ పి

హెచ్ టి టి పి మీద అప్లికేషనుకు సంబంధించిన సమాచారాన్ని మార్చుకోవటానికి ఉపయోగపడే యక్స్ యమ్ యల్ ఆధారంగా గలిగిన ప్రోటోకాల్ ను యస్ ఓ ఏ పి అంటారు.
  • ఇది వెబ్ సర్వీసు తో మాట్లాడటానికి కావలసిన ప్రోటోకాల్
  • యస్ ఓ ఏ పి అనగా సింపుల్ ఓబ్జేచ్ట్  యక్కెస్స్ ప్రోటోకాల్
  • ఇది ఒక సమాచార ప్రోటోకాల్
  • ఇది వార్తలను పంపించు ఒక నిర్మాణము
  • ఇది ఇంటర్నెట్ ద్వారా సమాచారాలను పంపించుటకు రూపొందించబడినది.
  • ఇది ప్లాట్ ఫాం స్వతంత్రము కలది.
  • ఇది భాషా స్వతంత్రము కలది.
  • ఇది యక్స్ యమ్ యల్ మీద ఆధారపడి ఉంటుంది
  • ఇది సులువైనది మరియు విస్తరింపదగినది.
  • దీని ద్వారా మనం ఫైర్వాల్ లను సులువుగా దాటవచ్చును.
  • ఇది డబ్య్లు౩సి ప్రమాణము
డబ్ల్యు యస్ డి యల్
వెబ్ సర్వీసును గుర్తించటానికి మరియు వివరించటానికి ఉపయోగపడే ఒక యక్స్ యమ్ యల్ మీద ఆధారపడిన భాష డబ్ల్యు యస్ డి యల్.
  • డబ్ల్యు యస్ డి యల్  అనగా వెబ్ సర్వీసు డిస్క్రిప్షన్ లాంగ్వేజ్.
  • ఇది  యక్స్ యమ్ యల్ మీద ఆధారపడి పనిచేయును
  • ఇది వెబ్ సర్వీసును వివరించును.
  • ఇది వెబ్ సర్వీసును గుర్తించును.
  • ఇది డబ్ల్యు ౩ సి ప్రమాణము.
యు డి డి ఐ

వివిధ రకాల పరిశ్రమలకు సంబందించిన సమాచారాలను పొందుపరచే ఒక సమాచార కేంద్రము యుడిడిఐ.
  • యుడిడిఐ అనగా యునివేర్సల్ డిస్కవరీ డిస్క్రిప్షన్ మరియు ఇంటిగ్రేషన్.
  • ఇది వివిధ రకాల వెబ్ సర్వీసులను గురించిన సమాచారాన్ని పొందుపరచును.
  • ఇది తనలో పొందుపరచిన సమాచారాన్ని ఇతరులకు వివరించును
  • ఇది యస్ ఓ ఏ పి ద్వారా సమాచారాలను పంపుతుంది.
  • ఇది మైక్రో సాప్ట్ .నెట్ ప్లాట్ ఫాం మీద రూపొందించబడినది.

లినక్సులో FFMPEG

09 November 2009

ఇంతకు ముందు ఒక పోస్టులో FFMPEG విండోస్ లో ఎంత సులువుగా ఉపయోగించవచ్చో చూశాము. ఇప్పుడు, లినక్సు లో FFMPG గురించి వివరాతి వివరంగా తెలుసుకుందాం.


1. ఎలా ఇన్స్టాల్ చేస్కోవాలి?
లినక్స్ లో వచ్చే చిక్కేంటంటే, రకరకాల లినక్సు లు ఉండి, దేనికి దానికే ఒక్కో పద్దతి ఉంటుంది. కాబట్టి అన్నిటికీ పని చేసేలా ఒక పద్దతి చెప్తాను, చేసెయ్యండి! ముందు, ఈ క్రింది చెప్పిన లైబ్రరీ లు అన్నీ ఇన్స్టాల్ చేస్కోవాలి. మీరు వాడే లినక్సులో సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్కొడానికి ఒక ప్యాకేజీ మేనేజర్ ఉంటుంది (ఫెడోరా ఐతే యమ్, ఉబుంటు ఐతే సినాప్టిక్/అప్ట్-గెట్) దానిలో ఈ క్రింది పదాలతో శోదించి, ఆ వచ్చిన ఫలితాల్లో, ఆయా పేర్లతో ఉన్న ప్యాకేజీ లను, వాటి డెవలప్మెంట్ ప్యాకేజీ లను  ఇన్స్టాల్ చేసెయ్యండి. ఒకవేళ మీకు ఆ ప్యాకేజీ మేనేజర్ లు వాడటం తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.
liba52
libgsm
libxvid
libamr
libmp3lame
libogg
libvorbis
libfaac
libfaad
libx264
ఉదాహరణకి, మీరు libogg గురించి శోదిస్తే, అక్కడ వచ్చిన వాటిల్లోంచి libogg0, libogg-dev లను ఇన్స్టాల్ చేయాలి, అలా అన్నిటికీ చెయ్యాలి.  ఇది పూర్తయ్యాక,  ఇక్కడున్న ప్యాకేజీ ని డౌన్లోడ్ చేస్కొండి. ఆ డౌన్లోడ్ చేస్కోగా వచ్చిన ప్యాకేజీ ని ముడి విప్పండి(అంటే untar చేయండి అని, క్రింద, దానికి కూడా కమాండ్ ఇచ్చాను, చూడండి). ఆ తర్వాత, విప్పితే వచ్చిన డైరెక్టరీ కి ఒక టెర్మినల్ లో వెళ్లి, ఈ క్రింది కంమాండ్లు కొట్టండి.
మీరు డౌన్లోడ్ ఎక్కడికి చేసారో, అక్కడికి ఒక టెర్మినల్ లో వెళ్లి, ఇలా ముడివిప్పండి.
tar -xvf ffmpeg-0.5.tar.bz2
ఇప్పుడు ఒక ఫోల్డర్ వస్తుంది. అందులోకి వెళ్ళండి.
cd ffmpeg-0.5
ఇప్పుడు ఈ క్రింది మూడు కంమాండ్లు కొట్టేయండి.
./configure --enable-gpl --enable-libfaac --enable-libfaad --enable-libgsm --enable-libmp3lame --enable-libtheora --enable-libvorbis  --enable-nonfree  --enable-shared --enable-x11grab --enable-libx264 --enable-libxvid --enable-pthreads --enable-libopenjpeg --enable-swscale
make
make install
make కొట్టాక కొంచెం టైం పడుతుంది (కొంచెం అంటే చా.....లా అన్న మాట! హాయిగా బొంచేసి రావచ్చు!). తర్వాత make install కొట్టడం మర్చిపోకండి. అంతా సవ్యంగా అయిపోతే, ఇక మీ పంట పండినట్టే :) అవ్వకుంటే, ఇక్కడ అడిగేస్తే, తెలిసినవారు జవాబిస్తారు.
అక్కడితో ఇన్స్టాల్ చేయడం సమాప్తం! ఇక పని చేస్తుందో లేదో చూడడానికి ఒక రాయి వేద్దాం, ఏదన్నాఆడియో/ వీడియో ఉంటే పట్రండి. మీరు తెచ్చిన ఆ వీడియో పేరు sample.mp3 అనుకుందాం. ఇప్పుడు అది కనీసం ౫ నిమిషాల నిడివి ఉందనుకుంటే, అందులోంచి ౨ నిమిషాల నుంచి ౩ నిమిషాల మధ్యలో ఉన్న ముక్కని ఒక wav లా కట్ చేద్దాం. దానికి ఈ కమాండ్ కొట్టండి.
ffmpeg -sameq -ss 00:02:00 -t 00:01:00 -i sample.mp3 sample.wav
మీరు అనుకున్నట్టు వస్తే మనం కుమ్మేసినట్టే. రాకపోతే, అదేమంటుందో చెప్తూ ఇక్కడ ఒక వ్యాఖ్యలో అడగండి, పరిష్కారం చెప్తాము. వచ్చే పాఠ్యాంశంలో ffmpeg తో మరిన్నినిత్య ఉపయోగకర కంమాండ్ల తో, ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.

లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?



చాలా మంది విండోస్ లో ప్యాకేజీలు ఇన్‌స్టాల్ చేస్కోవడానికి అలవాటు పడి, లినక్సుకి వచ్చేసరికి, కొంచెం తేడాగా ఉండే సరికి, కష్టమేమో అని గాబరాపడిపోతారు. కాని, అది ఒఠ్ఠి భయం మాత్రమే. ఈ పాఠ్యాంశంలో ఉబుంటు, ఫెడోరాలలో కొత్త పాకేజీలు ఎలా ఇన్‌స్టాల్ చేస్కోవాలో చూద్దాం.






ఉబుంటు ఐతే

ఉబుంటు లో మొత్తం మూడు పద్దతుల్లో ఇన్స్టాల్ చేస్కోవచ్చు. ఒక్కక్కటి చూద్దాం. ముందు మనం, ప్రాధమికంగా సిస్టం ని ప్యాకేజీ లు తెచ్చుకునే విధంగా సెటప్ చేస్కోవాలి. ఉబుంటు ఇన్స్టాల్ చేసిన కొత్తలో, ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్లని తీసెయ్యడం తప్పితే కొత్త అప్లికేషనులు తెచ్చుకోవడానికి ఉండదు. కానీ, మనం కొన్ని సోర్సులు కలిపితే ఆ సౌలభ్యం కల్పించుకున్నవారమవుతాం. దానికి ఇలా చేయాలి.
System లో Administration లో Synaptic Package Manager ఉంటుంది. దాన్ని తెరవండి. అది ఇలా బొమ్మలో లాగా ఉంటుంది.



ఒకవేళ మీకు మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినవారు ప్రాక్సి సర్వర్ వివరాలు ఇచ్చివుంటే ఈ స్టెప్ లో ఉన్నది చెయ్యండి. లేదంటే ఈ స్టెప్ అవసరం లేదు. సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ లో పైన మెనూ లో Settings లో Preferences నొక్కితే, ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా. అందులో, Network ట్యాబు కి వెళ్లి, అక్కడ మీ ప్రాక్సి వివరాలు ఇచ్చేయండి.

ఇందులో, పైన మెనూ లో ఉన్న Settings లో Repositories మీద కొడితే, ఇంకో విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా. అక్కడ, Ubuntu Software ట్యాబు క్రింద ఉన్నవన్నీ టిక్ చేసెయ్యండి. పక్కన Other Software లో డీఫాల్ట్గా ఉన్నవాటిని టిక్ చేసెయ్యండి. ఇదే విండో లో, updates ట్యాబు లో మీ సిస్టం తాజాకరణ వివరాలు సవరించుకోవచ్చు. ఇక ఆ విండో మూసెయ్యండి. ఇప్పుడు మర్చిపోకుండా, మొదటి విండో లో పైన ఉన్న Reload బటన్ కొట్టడం మర్చిపోవద్దు! అది కొడితే, మీరు కొత్తగా టిక్ పెట్టిన సైటుల్లోనుంచి ఉన్న ప్యాకేజీ వివరాలు లోడ్ చేస్తుంది. మీరు గమనించాల్సిన విషయం - రీలోడ్ చేసినప్పుడు ప్యాకేజీలను డౌన్లోడ్ చేయదు, వాటి వివరాలు -  పేరు, అదేం చేస్తుంది లాంటివి, మాత్రమే తెస్తుంది.





ఇక సెటప్ పూర్తయ్యినట్టే! ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేయడం అరటిపండు ఒలిచి నోటి దగ్గర పెడితే తిన్నట్టే ఉంటుంది.
౧. సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్
ఇప్పటి దాకా, మనం పైన చెప్పుకున్న సెటప్ అంతా చేసింది ఇందులోనే. దీన్ని తెరవడానికి, System లో  Administration లో ఉన్న Synaptic Package Manager ని క్లిక్ చేయాలి. ఇందులో, పైన ఒక శోధన బాక్స్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన పదాలతో వెతికితే ఫలితాలు చూపిస్తుంది. ఉదాహరణకి ఈ బొమ్మలో చూడండి. mplayer అని వెతికితే వచ్చిన ఫలితాలవి. ఫలితాలు వచ్చాక, అందులో మనకు కావాల్సిన ప్యాకేజీ పక్కన ఉన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే, Mark for Installation అని చూపిస్తుంది. అది కొట్టాలి. ఒకవేళ మీరు కోరుకున్న ప్యాకేజీ కోసం ఇంకేమన్నా ప్యాకేజీ లు తేవాలి అంటే అది మీకు చెప్తుంది, సరేనని కొట్టేయ్యండి. అన్నీ మార్క్ చేసాక,సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ విండో లో పైన Apply అని ఉంటుంది. అది కొడితే, ఎన్ని ప్యాకేజీ లు మార్క్ చేసారు, ఎంత డౌన్లోడ్ చేయాలి, ఎంత నిలువ ఆక్రమిస్తుంది లాంటి వివరాలన్నీ చూపిస్తుంది. సరేనని కొట్టేస్తే ఇన్స్టాల్ చేసేస్తుంది.


౨. ఆడ్/రిమూవ్ అప్లికేషను
ఇది కూడా సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ లాంటిదే. కాకపోతే ఇందులో అక్కడ ఉన్నన్ని అమరికలు ఉండవు. కాస్త తేలిగ్గా ఉంటుంది. దీన్ని తెరవాలంటే, మెయిన్ మెనూ లో, Add/Remove Applications ని క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావాల్సిన ప్యాకేజీ వెతుక్కుని టిక్ చేసి, క్రింద Apply అని ఉంటుంది, దాన్ని కొడితే ఇన్స్టాల్ చేసేస్తుంది.

. అప్ట్-గెట్
ఇక టెర్మినల్ ని ప్రాణప్రదంగా చుస్కునే వారికి ఎప్పుడు లోటు చెయ్యదు లినక్సు! మనం మొదట్లో కొన్ని సోర్సులు కలిపాం చూసారు? అవి ఇక్కడ కూడా కలపొచ్చు. ఎలా అంటే, ముందు ఒక టెర్మినల్ తెరిచి పెట్టుకోండి. ఇక క్రింది కంమాండ్లు ఏమేం చేస్తాయో చూడండి.
ls -R /etc/apt/
/etc/apt డైరెక్టరీ లో మన ప్యాకేజీ మేనేజర్ల వివరాలన్నీ ఉంటాయి.ఆ పై కమాండ్ ఆ డైరెక్టరీ లో ఉన్నవన్నీ చూపిస్తుంది. ఉదాహరణకి, అందులో, /etc/apt/sources.list, /etc/apt/sources.list.d/ లో ఉన్న ఇంకో ఫైల్, రెంటినీ చూడండి. మనం ఇందాక పైన కలిపిన సోర్సులు ఇక్కడ కనబడతాయి. మనం ఇక్కడే కలుపుకోవచ్చు కూడాను. లైన్ కి ముందు deb ఉంటే అది ఒక సోర్సు కి సంబంధించిన లైన్ అని గుర్తించాలి. ఒకవేళ # ఉంటే అది ప్రస్తుతానికి వాడకం లేదని గుర్తిచాలి. ఒకవేళ మీరు దాన్ని వాడాలి అంటే ఆ # ని తీసెయ్యాలి.
ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఒక కమాండ్ తో పని అంటే! ఉదాహరణకి మనం mplayer ఇన్స్టాల్ చేస్కోవాలి అనుకుందాం.
sudo apt-get install mplayer
అని కొడితే సరిపోతుంది. ఒకవేళ ఒక ప్యాకేజీ ని తీసెయ్యాలి అంటే,
sudo apt-get remove mplayer
అంటే సరిపోతుంది. మీకు ప్యాకేజీ పేరు తెలియకపోతే, ఈ క్రింది కమాండ్ తో శోధించవచ్చు.
sudo apt-cache search mplayer
ఇంక చెలరేగిపొండి. మీకు అడ్డే లేదు :)

ఫెడోరా ఐతే:

ఏ మాటకి ఆ మాటేనండి! ఉబుంటు లో ఉన్నంత సౌలభ్యం ఇందులో ఉండదు, గత ౫ ఏళ్లుగా చూస్తున్నా సరే, ఉబుంటు కి ఉన్న సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ కి సరితూగగల ప్యాకేజీ మేనేజర్ ఇందులో కానరాలేదు! అలా అని డీలా పడిపోకండి మరి. ఇందులో yum అనే ఒక అద్భుతమైన సాధనం ఉంది. కాకపోతే ఇది టెర్మినల్ లో మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిలో అసలు గ్రాఫిక్స్ అప్లికేషను ఏ లేదని కాదు, ఉన్నా సరే, దానితో సవా లక్ష సమస్యలు ఎదురవుతుంటాయి. ఇప్పటికి చాలా మంది ఆన్ లైన్ ఫోరం లలో, వీటి గురించి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. కాబట్టి, అన్నిటికంటే మంచి పద్దతి, మనకేమన్నా కోర్కేలుంటే వాటిని కాసేపు చంపుకుని, yum ని వాడుకోవడమే. మీరు ససేమిరా మేము వాడము, మాకు గ్రాఫిక్స్ విండో కావాలి అంటే, విక్రమార్కులు మరి మిమ్మల్ని ఆపగలమా, అలాగే కానివ్వండి - మెయిన్ మెనూ లో Add/Remove Softwares అని ఉంటుంది, అది నొక్కితే ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా, ఇంక మీ తిప్పలు మీరు పడండి :) Yum వాడతానన్నవాళ్ళు మాత్రం ఇంకా చదవి సుఖపడండి :)






ఒక టెర్మినల్ తెరిచి, ఈ క్రింది కమాండ్ కొట్టండి, ఒక ఫైల్ తెరుచుకుంటుంది.
su -c 'vim /etc/yum.conf'
ఒకవేళ, మీ నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చినవారు, మీకు ప్రాక్సి సర్వర్ వివరాలు ఇచ్చి ఉంటే, వాటిని ఈ క్రింది ఫార్మటు లో ఆ ఫైల్ లో ఒక లైన్ గా పెట్టాలి.
proxy=http://192.34.35.11:3128
అంటే, URL:port ఫార్మటు అన్న మాట.
ఇక ఆ ఫైల్ ని సేవ్ చేసేసి (ఎస్కేప్ కొట్టి, : కొట్టి, wq కొట్టండి), ఈ క్రింది కమాండ్ కొట్టండి.
ls /etc/yum.repos.d
అక్కడ, మీకు డీఫాల్ట్ గా వచ్చిన రిపాసిటరిలు అన్నీ కనిపిస్తాయి. అందులో మచ్చుకకి ఒక ఫైల్ తెరవండి, క్రింది కమాండ్ తో (ఫైల్ పేరు మార్చుకోండి, ఆ డైరెక్టరీ లో ఏమేమి ఫైళ్లు ఉన్నాయో చూసి)
su -c "vim /etc/yum.repos.d/livna.repo"
ఆ ఫైల్ లో ఈ క్రింది ఉన్న లైన్ ఉందేమో చూడండి.
enabled = 0
అలా ఉంటే, ఆ రిపాసిటరి ఉపయోగించబడటం లేదు. ఉపయోగించాలంటే, దాన్ని ఈ క్రింది విధంగా మార్చాలి.
enabled = 1
ఫెడోరా కి కావాల్సిన చాలా ప్యాకేజీ లు, లివ్నా అనే ఒక రిపాసిటరీ లో ఉంటాయి. అది సెటప్ చేస్కోవడానికి, ఈ క్రింది కమాండ్లు కొట్టండి.
wget -c http://rpm.livna.org/livna-release.rpm
rpm -ivh livna-release.rpm
ఇక అలా, మీకు నచ్చిన రిపాసిటరీలు  అన్నీ సరి చేస్కుకున్నాక, ఇక ఇన్స్టాల్ చేస్కోవడం తేలికే. ఉదాహరణకి, mplayer ఇన్స్టాల్ చేస్కుందాం.
yum -y install mplayer
అని కొడితే సరిపోతుంది. ఒకవేళ ఆ ప్యాకేజీ ని తీసెయ్యాలి అనుకుంటే,
yum remove mplayer
అంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ప్యాకేజీ పేరు తెలియక వెతకాలి అనుకుంటే,
yum search video player
అంటే అదే వెతికి, మీకు ఫలితాల్ని అందిస్తుంది.
మీకు ఇంక ఏమన్నా సందేహాలుంటే అడగండి.

సొంత వర్డుప్రెస్స్ సైటు లో థీమ్‌, ప్లగిన్లు పెట్టుకోవడం

04 November 2009





సొంత సైటు నిర్మాణానికి రాస్తున్న టపాలలో నాల్గవది.



మన "సొంతంగా ఒక సైట్ నిర్మించుకోవడం" అనే అంశంలో మూడు పోస్టులు చూశాము - సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?సొంత సైట్ లో వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?,బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ. ఇప్పుడు వర్డుప్రెస్సు తో నిర్మించుకున్న సైట్ ని కొత్త అలంకారాలతో, ప్లగిన్లతో ఎలా మార్చుకోవచ్చో చూద్దాం.

౧. థీమ్ లు/అలంకారాలు

అసలు అలంకారం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే మన వేస్కునే బట్టలు లాంటివే ఈ అలంకారాలు. పంచె, సూట్, లంగోటా ఇలా రకరకాలుగా ఉన్న బట్టల్లో మనం రకరకాలుగా కనబడ్డట్టే, ఒక్కొక్క అలంకారానికి సైట్ కి ఒక్కో రూపం వస్తుంది, ఉదాహరణకి వంటల బ్లాగో, కామర్స్ బ్లాగో మొదలెడితే, వాటికి తగ్గ బొమ్మలు, డిజైన్ ఉన్న అలంకారం ఎంచుకోవాలి. ఇప్పుడు అలాంటి అలమ్కారాల్ని ఎక్కడ పట్టాలో, పట్టి మన సైట్ లో ఎలా పెట్టాలో చూద్దాం.
  • ఈ లంకెకు  వెళ్లి, కావాల్సిన విషయానికి తగ్గ అలంకారాన్ని ఎంచుకోండి. అది దింపుకుని ఆ వచ్చిన జిప్ ఫైల్ ని ఎక్కడైనా విప్పండి(అన్జిప్ చేయమని).
  • అలా విప్పగా వచ్చిన ఫోల్డర్ ని మీరు వర్డుప్రెస్సు సైట్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసారో, అక్కడ wp-content అనే ఫోల్డర్ లో themes అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో పెట్టండి.
  • ఇప్పుడు మీ వర్డుప్రెస్సు డాష్ బోర్డు(అడ్మిన్ పానెల్) కి వెళ్ళండి. అక్కడ పక్కపట్టీ లో కనిపించు/Appearence లో అలంకారాలు/Themes అని ఉంటుంది. అది నొక్కితే, మీరు ఇందాక పెట్టిన అలంకారం అక్కడ కనిపిస్తుంది. ఆ అలంకారాన్ని Activate చేస్తే మీ సైట్ రూపు ఆ అలంకారానికి మారిపోతుంది.
  • ఆ అలంకారం లో అన్నీ నచ్చి, ఒకటీ రెండు చోట్ల మార్పూ కావాలి అనుకుంటే మీకు CSS పరిజ్ఞానం కావాలి (టెక్ సేతు లో దాని పై కూడా పాఠ్యాంశాలు వస్తాయి). మీకు కొద్దో కొప్పో తెలుసనే అనుకుంటే ఆ అలంకారానికి సంబందించిన సమాచారం అంతా మీరు ఇందాక themes ఫోల్డర్ లో పెట్టిన ఆ అలంకారం ఫోల్డర్ లోనే ఉంటాయి. చాలా వరకు ఆ అలంకారం కూర్పులు, చేర్పులు style.css ఫైల్ లోనే నిక్షిప్తమయ్యి ఉంటాయి.

౨. ప్లగిన్లు/పొడిగింతలు

అలంకారం హంగుకి, ఆర్భాటానికి ఐతే పొడిగింతలు సైట్ పనితనానికి, అంటే మీరు రూపు రేఖల్లో కాకుండా సైట్ లో కొత్తగా ఎమన్నా చేర్చాలనుకుంటే ఆ పని చేసేవే పొడిగింతలు. ఉదాహరణకి మీ సైట్ ని శోధన యంత్రాల్లో బాగా కనిపించేలా చేయాలన్నా, మీరు రాసినా టపాల్లో కొన్ని నియమాల్ని అనుసరించి కొన్ని పోస్టులనే ఎంచి అవి పాఠకులకి చుపించాలన్నా, అసలు ఇఅంటి పనులు ఏం చేయాలన్నా మనకు పొడిగింతలు అవసరం. అవి ఎక్కడ సంపాదించి ఎలా ఉపయోగించాలో చూద్దాం.
  • ఈ లంకెకు వెళ్లి, మీకు కావాల్సిన పనికి సంబందించిన పదాలతో వెతికితే కొన్ని ఫలితాలొస్తాయి. అందులోంచి మీకు నచ్చినది ఎంచుకుని దించుకోండి.
  • ఆ దించిన జిప్ ఫైల్ ని విప్పి మీరు వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసిన చోట, wp-content అనే ఫోల్డర్ లో plugins ఫోల్డర్ ఉంటుంది. అందులో పెట్టండి.
  • ఇప్పుడు మీ వర్డుప్రెస్సు డాష్ బోర్డు కి వెళ్లి, పక్కపట్టీలో Plugins అని ఉంటుంది. అది నొక్కితే ఇందాక మీరు పెట్టిన ఆ పొడిగింతని చూపిస్తుంది. దాన్ని Activate చేస్తే ఇంకా వాడుకోవచ్చు. పొడిగింత ఎలా వాడుకోవాలో మీరు అది దించుకున్న పేజీలోనే ఉంటుంది.
ఒకవేళ మీకు కావాల్సిన పొడిగింత దొరకకపోతే, మీరే అది తాయారు చేసుకోవచ్చు. కాకపోతే దానికి PHP పరిజ్ఞానం అవసరం అవుతుంది (టెక్ సేతు లో భవిష్యత్ లో వీటి మీద కూడా పాఠ్యాంశాలుంటాయి). తర్వాతి టపాలో, ప్రతి సైట్ కి కావాల్సిన ముఖ్యమైన పొడిగింతల జాబితా చూసి అవి ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం. దృపాల్ లో సైట్ నిర్మాణం కూడా మొదలుపెడదాం.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

సొంత సైట్ లో వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా


మీకు ఒక సొంత సైట్ ఉంటే దాని నిర్మాణం మొత్తం మీకు మీరే చేతులమీదకి ఎత్తుకోవక్కర్లేకుండా, కాగల కార్యం చిక్కుల్లేకుండా కానిచ్చేసేందుకు  ఎన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయ్. వాటిని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటారు. అందులో చాలా తేలికైన, ప్రసిద్దిచెందిన వర్డుప్రెస్సుని మీ సైట్ లో ఎలా ఇన్స్టాల్ చేస్కోవాలో చూద్దాం.

మీరు ఒక ఒక సొంత సైట్ కానీ, బ్లాగ్ కానీ నిర్మించుకోవడం మొదలుపెట్టడానికి ముందు ఇక్కడ నొక్కి సొంత సైట్ కి పేరు, స్థానం సంపాదించుకోవడం ఎలాగో తెలుసుకోండి. ఇక విషయానికొస్తే, అసలైతే వర్డుప్రెస్సు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం కాదు. కాని, ఎంచుమించు వాటికుండాల్సిన పనితీరు ఉంది కాబట్టి ఇది కూడా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం అనే భావిద్దాం. భవిష్యత్ లో మిగతా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంల గురించి తెలుసుకునేటప్పుడు తేడా ఏంటో చూద్దాం. ప్రస్తుతానికి వర్డుప్రెస్సు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం.
గమనిక: ఈ క్రింది సూచనలు వర్డుప్రెస్సు సైట్ లో ఇంగ్లీష్ లో ఉన్న సూచనలకు అనువాదాలు.
హోస్టింగ్/ఆవాసం తీస్కున్నప్పుడు వారు మీకు సర్వర్ కి కన్నెక్ట్ అవ్వడానికి ftp/ssh వినియోగదారునామము(username), సంకేతపదము(password) ఇస్తారు. వర్డుప్రెస్సు మీ సర్వర్ పై ఇన్స్టాల్ చేయడం చాల సులువైన, 5 నిమిషాల పని! ఈ క్రింది సూచనల్ని పాటిస్తే చాలు!
  1. ఇక్కడ నుంచి వర్డుప్రెస్సు ప్యాకేజీ ని డౌన్లోడ్ చేస్కుని, దాన్ని unzip చేయండి.
  2. మీ హోస్టింగ్/ఆవాస సర్వర్ లో ఒక డేటాబేసు సృష్టించుకోండి. ఒకవేళ ఆ డేటాబేసు కి వినియోగదారుడు ఇంతకు మునుపే లేకపోయుంటే, ఆ డేటాబేసు మీద సర్వ హక్కులు ఉండేలా ఒక వినియోగదారుని కూడా సృష్టించండి.
  3. మీరు unzip చేసిన ఫోల్డర్ కి వెళ్లి wp-config-sample.php అనే ఫైల్ పేరుని wp-config.php గా మార్చండి
  4. wp-config.php ఫైల్ ని తెరిచి ఆ డేటాబేసు వివరాలు పూరించండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ తో మాత్రం తెరవవద్దు. ఏ నోట్పాడో(notepad) ఐతే మంచిది. డేటాబేసు వివరాలు ఎలా పూరించాలో ఆ ఫైల్ తెరిచి చూస్తే మీకే అర్థమయిపోతుంది. దానిలో Database Username, Password etc.. అని రాసి ఉంటుంది. అవి చూసుకుని ఎక్కడ ఏ వివరం రాయాలో అది రాసేయ్యాలి.
  5. ఇప్పుడు ssh/ftp ద్వారా ఈ ఫోల్డర్ లో ఉన్నవన్నీ(ఆ ఫోల్డర్ మటుకు కాదు సుమా, అందులో ఉన్నవి మాత్రమే!) మీ హోస్టింగ్/ఆవాస సర్వర్ లో పెట్టాలి. సర్వర్ లో సరైన జాగాలో పెట్టడం ముఖ్యం. ఒకవేళ తెలియకపోతే ఎవరినైనా అడిగి చేయండి. లేదా ఇక్కడే మీ సందేహం ఏంటో తెలపండి. సాదారణంగా తలెత్తే కొన్ని సందర్భాలు ఇవీ,
  6. ఇక చివరి ఘట్టం! వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేయడానికి http://site.com/wp-admin/install.php కి వెళ్ళాలి. ఇక్కడ site.com బదులు మీ సైట్ పేరు ఇవ్వండి. ఇది వర్డుప్రెస్సు సరాసరి వెబ్సైటు రూట్ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చేస్కునే వారికి. ఒకవేళ మీరు వేరే చోట పెట్టి ఉంటే అందుకు అనుగుణంగా ఆ URL మార్చుకోవాలి. ఉదాహరణకి blog అనే ఫోల్డర్ లో గనక ఇన్స్టాల్ చేస్కుని ఉంటే, http://site.com/blog/wp-admin/install.php కి వెళ్ళాలి.
వర్డుప్రెస్సు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయ్యేటప్పుడు అది అడిగినచోట సరైన e-మెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి, మీ సంకేతపదాన్ని(password) ని ఆ మెయిల్ ఐడి కే పంపిస్తుంది. ఏమైనా తేడా వస్తే వివరాలతో ఇక్కడ తెలుపండి.
వర్డుప్రెస్సు తో ప్రాధమికంగా ఏమేమి చేయొచ్చో ఇక్కడ రాశాను. ఒకసారి అది చూడండి. వచ్చే టపాలో వర్డుప్రెస్సు లో కొత్త పొడిగింతలు/ప్లగిన్లు, అలంకారాలు/థీమ్స్ ఎలా పెట్టాలో తెలుసుకుని, పలురకాల సైట్లకి వర్డుప్రెస్సుని ఏ విధంగా మార్చుకోవొచ్చో కూడా చూద్దాం.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

సొంత సైట్ కావాలనుకుంటే ?



ఒక సొంత సైట్ కావాలనుకుంటే ఎక్కడ మొదలుపెట్టి ఏమేమి చేయాలో తెలుసుకోండి.
సొంత సైట్ కోసం మనం చేయాల్సినవి మూడు పనులు.

సైట్ పేరు ఎంచుకోవడం

సైట్ పేరుని డొమైన్ లేదా సీమనామము అంటారు. ముందు మీ సైట్/బ్లాగ్ కి ఒక పేరు ఎంచుకోండి. తర్వాత మీరు ఆ సైట్ ఎందుకు వాడాలనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి దాని చివర .com, .in, .net, .ఆర్గ్, .info లాంటి వాటిల్లో ఏది ఎంచుకోవాలో చూసుకోండి. ఏది పెట్టుకున్నా పర్వాలేదు కానీ, కాస్త అర్థవంతంగా ఉంటే మంచిది కాబట్టి చూసి నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణకి అది మీ వ్యక్తిగాతమైతే మనది భారతదేశం కాబట్టి .in పెట్టుకోవచ్చు. అది ఒక e-commerce లాంటి కమర్షియల్ వాటి కైతే .com అని పెట్టుకోవచ్చు. స్వచ్చంద సంస్థల వంటివాటికి  .org బావుంటుంది. సమాచారం అందరికి పంచే సైటైతే .info అని పెట్టుకోవచ్చు. .net అంటే ఇదివరకు నెట్వర్క్ కి సంబందించిన ఒక అర్థం ఉండేది కానీ, ఇప్పుడు ఆ అర్థంతో వాడుతున్నట్టేమి కనబడట్లేదు. కానీ, సైట్ అంటే .com యేనని మనసులో ముద్రపడిపోయింది చాలా మందికి. ఇప్పుడిప్పుడే అంతర్జాలం విస్తరిస్తున్న పల్లెల్లో ఈ భావన ఎక్కువ. కాబట్టి మీ సైట్ కి వచ్చేవారు ఎవరు అనేదాన్నిబట్టి కూడా చూసుకోవాలి.

ఆ పేరు రిజిస్టర్ చేయడం

ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలకైన తీసుకోవచ్చు. లేదా ఇక ఎప్పటికి ఆ పేరు మీదే అన్నట్టు కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కి చాలా సైట్లు ఉన్నాయ్. ఉదాహరణకి హోస్ట్.ac, గో డాడీ, రిజిస్టర్.కాం చూడండి. మిగతా వాటి కోసం గూగుల్ ని అడిగితే సరి. ఆ సైట్లలో ఏదైనా ఒకటి ఎంచుకుని అక్కడ మీరు అనుకున్న పేరు లభ్యత ఉందేమో చూసుకోండి. లేకపొతే ఇంకో పేరు ప్రయత్నించాలి. ఒకవేళ ఉంటే క్రెడిట్ కార్డు ద్వారానో, పేపాల్ ద్వారానో, మరే ఇతరమార్గం ద్వారానో ఆ పేరు కొనుక్కోవాలి. మామూలుగా అయితే సంవత్సరానికి .in తో ముగిసే పేర్లు 20 డాలర్లు దాకా ఉంటే, మిగతావన్నీ 10 డాలర్లు ఉంటాయి.

జాల జాగా కొనుక్కోవడం

ఇప్పుడు మీ సైట్ లో మీరు పెట్టాలనుకున్నవన్నీ పెట్టడానికి ఒక జాగా లేదా ఆవాసం కావాలి. మామూలుగానైతే మీరు ఎక్కడైతే ఆ పేరు కొన్నారో, వాళ్ళ దగ్గరే ఆవాసం కూడా కొనుక్కునే సౌలభ్యమ్ ఉంటుంది. కానీ మీ అవసరాన్ని బట్టి, మీరు ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నారో అన్నదాన్నిబట్టి వేరే చోట్ల కూడా వెతికిన తర్వాత నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణ కి g33k హోస్టింగ్, బ్లూ హోస్ట్, హోస్ట్.ac లాంటి ఆవాసదాతల్ని చూడండి.
ఇప్పుడు పేరూ, జాగా సిద్ధం! తర్వాత ఏం చేయాలో వచ్చే టపాలో చూద్దాం!!


టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

ఉచితబ్లాగు నిర్వహణ, సైటుల గురించి వివరణ,బ్లాగు,

03 November 2009

కొంతమంది వారివారి అవసరాల్ని బట్టి అంతర్జాలంలో వారికి ఒక స్థానం కోసం చూస్తుంటారు. కానీ, అది సైటా? బ్లాగా? అన్న సందిగ్దంలో ఉంటారు. వాటి మధ్య తేడాలు, ఎప్పుడు ఏది వాడలో తెలుసుకుందాం. అలాగే ఉచితంగా లబించే బ్లాగులు ఎలా నిర్వహించుకోవాలో చూద్దాం.

ముందు సైట్ అంటే ఏంటో చూసి తర్వాత బ్లాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సైట్ అంటే అంతర్జాలం లో ఒక సంస్థగాని, వ్యక్తిగాని కృత్రిమంగా హాజరు కావడానికి వాడే ఒక సాధనంలా చెప్పుకోవచ్చు. ఐతే ఇప్పటి పరిస్థితికి ఆ నిర్వచనం సరిపోదు. ఉదాహరణకి గూగుల్ ని తీస్కుంటే, శోధన యంత్రం కూడా ఒక సైటే, కానీ అదో ఉపకరణం! అది ఒక సంస్థ గురించో, వ్యక్తి గురించో చెప్పటం లేదు. ఇలా ఇప్పుడు సైటు అంటే, అంతర్జాలం లో ఉండే ఏదైనా కావచ్చు అన్న స్థితి నెలకొంది. మరి బ్లాగు కూడా సైటేనా అన్న అనుమానం మీకు రావచ్చు. అవును! బ్లాగు కూడా ఒక రకం సైటే! కానీ, బ్లాగ్(blog) అంటే వెబ్లాగ్(weblog), అంటే "వెబ్ లాగ్", అంటే అంతర్జాలం లో మనం ఏదైనా అంశం గురించిన కొన్ని విషయాలు పొందుపరచడానికి వాడే ఒక సైటు. ఉదాహరణకి నా బ్లాగ్ టిడ్బిట్స్ తీస్కుంటే, అందులో నా జీవితం గురించి, కొన్ని సమస్యల గురించి రాస్తుంటాను. ఇలా ఎవరికీ నచ్చిన అంశం గురించి వాళ్ళు రాసుకోవచ్చు. వచ్చే టపాలలో వరుసగా బ్లాగులు, సైటులు ఎలా వాడుకోవాలి. సొంతవి ఎలా నిర్మించుకోవాలి అన్న అంశాలు రాస్తాను.
అందాకా, అందరూ ఎక్కువగా వాడే, ఉచితంగా వచ్చే బ్లాగుల గురించి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మీరు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా సొంతంగా ఒక బ్లాగు ఏర్పాటు చేస్కోవచ్చు. నెటిజన్లు ఎక్కువగా వాడే వర్డుప్రెస్సు, బ్లాగ్స్పోట్ ల గురించి తెలుసుకుందాం.
మీకు జిమెయిల్ ఎకౌంటు ఇప్పటికే ఉండి ఉంటే ఇంకా ఎకౌంటు సృష్టించుకునే పని లేకుండానే ఇక్కడికి వెళ్లి బ్లాగ్స్పోట్ లో బ్లాగడం మొదలెట్టేయోచ్చు. ఒకవేళ జిమెయిల్ ఎకౌంటు ఉన్నా కూడా, వర్డుప్రెస్సుని ప్రియంగా వాడేవారు చాలామందే ఉన్నారు, కాబట్టి మీరు సీరియస్ గా బ్లాగడం మొదలెట్టే ముందు ఒకసారి రెండింటిని చూడడం మేలు. ఏది నచ్చితే దానికి మళ్ళిపోవచ్చు. వర్డుప్రెస్సు ఎకౌంటు ఇక్కడికి వెళ్లి సృష్టించుకోవచ్చు. ఉచిత ఎకౌంటు లో తెలుసుకోవలసినవి ముఖ్యంగా మూడు విషయాలు. రెండిటిల్లోను తెలుగు సౌలభ్యం ఉంది.  ఉచిత ఎకౌంటు లో మనం చేయగలిగేవతిల్లో ముఖ్యమైనవి ఇక్కడ చెప్తాను.
  • కొత్త టపా ఎలా రాయాలి?
  • బ్లాగు రూపు ఎలా మార్చాలి?
  • అందరికి తెలిసేలా ఏం చేయాలి?
నేను ఇక్కడ ఇవీ చెప్పేటప్పుడు వర్డుప్రెస్సు ని అధారంగా చేస్కుని చెప్తాను. కానీ, బ్లాగ్స్పోట్ లో కూడా అరకొర మార్పులతో చాలా వరకు అదే విధంగా ఉంటుంది.
ముందుగా మీరు మీ డాష్‌బోర్డ్ లో ఉన్నారేమో చూస్కోండి. లేకపోతే పైన ఉన్న పట్టీలో Dashboard అని ఉంటుంది, అది నొక్కండి. వివరణ కొరకు క్రింద ఉన్న బొమ్మ చూడండి.



ఇప్పుడు అక్కడ ఎరుపు మార్కుతో చూపించిన Dashboard పై నొక్కితే ఈ క్రింద చూపించిన పేజీకి వస్తారు.



౧. కొత్త టపా ఎలా రాయాలి?

క్రింద బొమ్మలో చూపించినట్టు ఆ డాష్‌బోర్డ్ పేజీలోనే పైన ఏడమచేతి వైపు "కొత్త టపా" అని ఉంటుంది. అక్కడున్న త్రికోణం గుర్తుపైకి మౌస్ ని తెస్తే(నొక్కకుండా) అది మిగతా ఆప్షన్లని కూడా చూపిస్తుంది. అక్కడ మీరు కొత్త టపా లేదా కొత్త పేజీ నొక్కి వాటిని సృష్టించుకోవచ్చు. పేజీకి టపాకి ఒక తేడా ఉంది. మీ గురించి చెప్పడానికో, లేదా సైటులో ఎప్పుడూ కనబడాలనుకునే ఒక విషయమో ఐతే, దాన్ని పేజీలా రాసుకోవాలి. రోజూవారి రాతలన్నీ టపాలలాగా రాసుకోవాలి. ప్రయత్నించండి.




౨. బ్లాగు రూపు ఎలా మార్చాలి?

ఇక్కడ బ్లాగు కనిపించే విధానం ఎంచుకోవడమెలాగో తెలుసుకుందాం. డాష్‌బోర్డ్ పేజీలో కుడివైపునున్న పట్టీలో కొంచెం క్రింద, "కనిపించు" అని ఉంటుంది. అక్కడ ఉన్న త్రికోణం మీద నొక్కితే క్రింద చూపించినట్టు దానిక్రింద అమర్చబడ్డ మిగతావన్నీ కూడా చూపిస్తుంది. రూపు మార్చుకోవాలంటే "అలంకారాలు" లోకి వెళ్ళాలి. అక్కడ రకరకాల అలంకారాలని(థీమ్స్) చూపిస్తుంది. క్రింద బొమ్మ చూడంది. వాటిల్లో మీకు నచ్చింది, మీ బ్లాగుకి సరిపోయేది దాని మీద నొక్కి ఎంచుకోండి. ఆ అలంకారం మీ బ్లాగుకి వర్తింపచేసి చూపిస్తుంది, మీకు నచ్చితే "సచేతనమగు" అని పైన ఏడమ చేతివైపునున్న లంకెను నొక్కండి, లేదంటే అక్కడ x మార్కు నొక్కి మూసేయండి.





ఇంకా "కనిపించు" క్రింద ఉన్న విడ్జెట్లు, Custom Header, శీర్షపు రంగులు కూడా మీ బ్లాగు రూపురేఖల్ని మార్చడానికి ఉపయోగించవచ్చు. మీ బ్లాగుని సందర్శిస్తే అక్కడ పక్కన ఉన్న పట్టీలలో ఉండే వివిధ రకాల లంకెలు విడ్జెట్లు వాడగా వచ్చేవే.  ఉదాహరణకి మీ బ్లాగులో మీరు ఇటీవల రాసిన టపాలు పక్కన పట్టీలో కనబడాలంటే, "విడ్జెట్లు" మీద నొక్కి "ఇటీవలి జాబులు" ని మౌస్ తో పట్టుకుని "పక్కపట్టీ" అని ఉన్న దానిలో పడేయడమే. ప్రయత్నిస్తే తెలుస్తుంది, ప్రయత్నించి చూడండి. అలా పడేశాక ఇదిగో ఈ క్రింద చూపించినట్టు కనిపించాలి ఆ పేజీ.


Custom Header కి వెళితే మీ బ్లాగుకి పైన వచ్చే బొమ్మని మీకు ఇష్టంవచ్చిన బొమ్మతో మార్చుకోవచ్చు. కానీ, బొమ్మ అది చెప్పిన పరిమాణంలోనే ఉండాలి సుమా! బొమ్మ మార్చాక అక్కడ ఉన్న అక్షరాల రంగు ఆ బొమ్మ మీద బావుండకపోవచ్చు. కాబట్టి "శీర్షపు రంగులు" మీద నొక్కి అక్కడ, పైన బొమ్మ మీద వచ్చే అక్షరాల రంగుని మార్చుకోవచ్చు. ప్రయత్నించండి.

౩. అందరికి తెలిసేలా ఏం చేయాలి?

మీది తెలుగుబ్లాగైతే, కూడలిలోనూ, జల్లెడలోనూ మీ బ్లాగు కలపమని అభ్యర్థించవచ్చు. వేరే భాషలో బ్లాగైతే వాటికి తగ్గ బ్లాగుసమాహారాలు ఉంటాయి, వాటిల్లో కలపాలి. ఇంకా మీ సైటుకి ట్విట్టర్ ని అనుసందానించడం, మీ స్నేహితులకి తెలిసేలా మీ gtalk స్థితిలో మీరు కొత్త టపా రాసినప్పుడు ఆ లంకె పెట్టడం లాంటివి మీ బ్లాగు ప్రాచుర్యానికి దోహదం చేస్తాయి. కానీ, ముఖ్యంగా మీరు చేయవల్సింది ఒకటుంది! మీ బ్లాగు శోధనయంత్రాలకి కనబడేలా చేయడం. ఇది ఎలా అంటే, క్రింద బొమ్మలో చూపించినట్టు డాష్‌బోర్డ్ లో పక్కనున్న పట్టీలో ఉన్న "అమరికలు" లో "అంతరంగికత" లోకి వెళ్ళి అక్కడ మొదటి ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఒకవేళ మీరు చెప్పినవాళ్ళు తప్ప ఎవరికీ కనబడకూడదన్నా దానికి తగ్గ ఆప్షన్ ని కూడా ఎంచుకోవచ్చు.


బ్లాగుకి ఏమౌతుందోనని ఏమాత్రం భయపడకుండా ఆ పట్టీలలో ఉన్నవన్నీ ఒకసారి కలియతిరిగేసి ప్రయత్నించేస్తే అన్నీ అర్థమవుతాయి, మొదలెట్టండి మరి :)
వర్డుప్రెస్సు లో ఉచితంగా వచ్చే బ్లాగులలో ప్రకటనలిచ్చుకోవడం(advertisements ఇవ్వడం) కుదరదు. కానీ  బ్లాగ్స్పోట్ లో ఆ సదుపాయం ఉంది. ఇలా ఉచితంగా కాక, సొంతగా కూడా సైట్ నిర్వహించుకోవచ్చు. అదెలాగో ఇక్కడున్న టపాలో చూడండి :)
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English